నారసింహుడిపై అన్నమయ్య కీర్తనలు
ఒక కీర్తన మాత్రం ఏ సందర్భంలో రాసాడో తెలియదు కానీ అన్నమయ్య సినిమాలో ఆ పాటను తనమీద కీర్తనలను రాయమన్న రాజు ఆజ్ఞను ధిక్కరించగా అన్నమయ్య ను బంధించినప్పుడు నరసింహస్వామి ని వేడుకోగా ఆ బంధనాలనుంచి విముక్తుడిని చేసినట్టు చిత్రీకరించారు.
ఇదే ఆ పాట
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా
ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- కారణ ప్రకట వేంకట నారసింహా
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం విమాన ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు ఉండే చిన్న నిర్మాణం యోగనరసింహ స్వామి ఆలయం. ఈ నిర్మాణం 15వ శతాబ్దం నాటికే ఉన్నట్లు అన్నమయ్య సంకీర్తనల నిరూపణ అవుతోంది. యోగనారసింహ స్వామికి నిత్య పూజలు ఉండవు కానీ నిత్య నైవేద్యం మాత్రం ఉంటుంది.శనివారం పూజలు, నివేదనలు జరుగుతాయి.నృసింహ జయంతి రోజు విశేష పూజలు, నైవేద్యాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటి సందర్భంలో నారసింహుణ్ని చూసిన అన్నమయ్య అలౌకిక అనుభూతికి లోనై 'సకల సంపదలకూ మూలమైన ఇందిరను తొడమీద కూర్చొబెట్టుకుని కొలువుదీరాడట' అంటూ ఆశువుగా వచ్చినదే ఈ కీర్తన.
ఆరగించి కూచున్నా డల్లవాడే
చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు
ఇందిరను దొడమీద నిడుకొని కొలువిచ్చి
అందపు నవ్వులు చల్లీ నల్లవాడే
చెందిన మాణికముల శేషుని పడగె మీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు
బంగారు మేడలలోన పచ్చల గద్దియల మీద
అంగనల యాట చూచీ నల్లవాడే
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నడా లక్ష్మీనారసింహుడు
పెండెపు బాదము చాచి పెనచివో పాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి గోరి యహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు
అంటే...శేష పానుపుపై బంగారు మేడలలోపల కొలువైన నరహరి అప్సరసలు ఆడుతుంటే చూస్తూ విలాసం ఒలకబోస్తున్నాడు. త్రిమూర్తుల్లో విష్ణువు రజో గుణ ప్రధానుడు. ఈవిధంగా బంగారు మేడలలోపలి వైభవాన్ని పదకవితా పితామహుడు రెండో చరణంలో వివరించాడు. ఇందిరను ఎడమ తొడమీద పెట్టుకుని నరసింహ స్వామి కూర్చున్న భంగిమ కూడా విశేషమైందే. ఆయన గండపెండేరం అలంకరించుకున్న కుడికాలు పాదాన్ని కిందికి చాచి పెట్టి,మరో కాలును మెలిదిప్పి పూజలు అందుకుంటున్నాడట. ఆ లక్ష్మీనరసింహుడు ఏడుకొండల కొలువు కూటమైన శ్రీవేంకటాద్రి,అహోబల క్షేత్రంలో గొప్పగా శోభిల్లుతూ ఉన్నాడు. దీనినే మూడో చరణంలో వర్ణించాడు అన్నమయ్య.మూడు చరణాల్లో ‘అల్లవాడె’ అనే పదం ప్రయోగించడం చూడొచ్చు. అల్లవాడె అంటే ఆయనే (లక్ష్మీనరసింహుడే) అని అర్థం.
అన్నమయ్య ఏ క్షేత్రానికి వెళ్లినా అది ఆయనకు తిరుమలే. ఆయా క్షేత్రాల్లో కొలువైన నరసింహుడు, రాముడు, కృష్ణుడు, చెన్నకేశవుడు, విఠలుడు.. ఎవ్వరిని కొలిచినా ఆ దైవం సాక్షాత్తూ తిరుమలేశుడే.