అరటిపండు, కొబ్బరికాయ మాత్రమే ఎందుకు నైవేద్యం అంటే సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను పారేస్తాం. తిని పడేయడం వల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. వాటి నుంచి మొక్క వస్తుది…మళ్లీ ఫలాలు అందిస్తుంది. అంటే మనం తిని పడేసిన విత్తనాల వల్ల వచ్చిన ఫలాన్ని ఎంగిలి ఫలంగా భావించి భగవంతుడికి నివేదించే విషయంలో కాస్త ఆలోచిస్తారు.




అరటిపండుకి బీజం ఉండదు. ఓ అరటి చెట్టు నాటితే ఆ చుట్టూ వందల పిలకలు వస్తాయి కానీ అరటి పండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే ఎంగిలి కాని ఫలం అరటిపండు. దీన్ని పూర్ణఫలం అని కూడా అంటారు.




ఇక కొబ్బరి కాయ కూడా అంతే. కొబ్బరి నాటితే కొబ్బరి మొక్క రాదు. మనం తిని పడేసిన పెంకు నుంచి , ముందే  వలిచిన పీచు నుంచి కొబ్బరి మొక్క వచ్చే అవకాశమే లేదు. అయితే మన సంస్కృతి కేవలం భౌతికం మాత్రమే కాదు ఆధ్యాత్మికం కూడా. కొబ్బరికాయలో జీవిత సత్యం దాగిఉంది. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియచేసారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం.” కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు, అని ఆయన చెప్పారు.




 


ఇక అరటిపండునే నైవేద్యంగా ఎందుకు పెడతామో అని చెప్పడానికి ఓ పురాణగాధ చెబుతారు పెద్దలు. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి, అనే శక్తులు ఆవిర్భవించాయి. వీరిలో రాధ, సావిత్రి ఇద్దరూ అంత్యంత సౌందర్యరాశిలు. అయితే తన తనంత సౌందర్యరాశి లేదని అహం ప్రదర్శించిన సావిత్రిని… బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించమని విరాట్ మూర్తి శాపం ఇచ్చాడు. అరటి చెట్టుగా మారిన సావిత్రి శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకి మెచ్చిన విరాట్ మూర్తి ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంశ రూపంలో మానవ, మాధవ సేవకోసం భూలోకంలో ఉండమని ఆదేశించాడు. అప్పటి నుంచీ దేవుడి పూజలో భాగమైంది అరటిపండు.




ఇక కొబ్బరికాయ కుళ్లిపోతే ఏదో అరిష్టం అని..ఏదో జరిగిపోతుందని భయపడతారంతా. కానీ అదంతా అపనమ్మకం మాత్రమే. ఒకవేళ వంకర టింకరగా పగిలినా కూడా ఎలాంటి నష్టం లేదు. ఇక టెంకాయ గుండ్రంగా పగిలితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని…టెంకాయలో పువ్వు కనపడితే అది మీకు శుభాలు తీసుకొస్తుందని విశ్వశిస్తారు. నిలువుగా పగిలితే మీ ఇంట్లో వారికి త్వరలో సంతానం కలుగుతుందని సూచన అని చెబుతారు. అందుకే కుళ్లినా, ఎలా పగిలినా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. కొబ్బరి పగిలితే కనిపించేంత స్వచ్ఛమైన మనసుతో దేవుడిని ప్రార్థిస్తే చాలంటారు.