ఈ ఏడాది ఫిబ్రవరి 18, శనివారం రోజున మహా శివరాత్రి పర్వదినం జరుపుకోబోతున్నాం. ఆరోజున మహాదేవుడిని రకరకాల పద్ధతుల్లో కొలుస్తారు. ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. గోగుపూలు, మారేడు, బిల్వ దళాలను సమర్పిస్తారు. వీటన్నిటిలో బిల్వపత్రం చాలా శ్రేష్టమైందని చెబుతుంటారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వ పత్రాన్ని ఆమహా దేవుడికి సమర్పిస్తారు. అసలు ఇది ఎందుకు సమర్పిస్తారు? దీని వైశిష్ట్యం గురించి పండితులేమంటున్నారు తెలుసుకుందాం.
శివభక్తులు ఏడాదంతా శివరాత్రి కోసం వేచి ఉంటారు. ఈరోజున శివుడి కళ్యాణోత్సవం జరుపుతారు. శివ పురాణం ప్రకారం.. సృష్టి ఈ రోజు నుంచే మొదలైంది. బ్రహ్మ, విష్ణులతో సహా ఈ రోజునే ఒక అగ్ని లింగం నుంచి సృష్టి ప్రారంభమైందని శివ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున శివ లింగానికి ప్రత్యేక సేవలు చేస్తారు. ఎన్నో రకాల పద్ధతుల్లో శివపూజ చేస్తారు. వాటిలో ఒకటి శివలింగం పై బిల్వపత్రాన్ని ఉంచి చేసే పూజ. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. శివలింగం పై బిల్వపత్రాలను ఉంచి పూజ చేసుకుంటే శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఏకంగా శివారాధన కోసం బిల్వాష్టకమే రాశారు. శివ పూజలో బిల్వ పత్రానికి అంత ప్రాశస్త్యం ఉంది.
పర్వత రాజ కుమార్తె పార్వతి, శివుని వరించి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. సతీ వియోగంలో మహా ద్యానంలో ఉన్న శివుని ప్రసన్నం చేసుకునేందుకు పార్వతి శివుడి కోసం తప్పస్సు చెయ్యడం మాత్రమే కాదు.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, ఎన్నో ఉపవాసాలు చేసింది, ఎన్నో పూజలు చేసింది, చాలా ప్రయాత్నాలు చేసింది. బిల్వ వృక్షం కింద ఒకసారి మహాదేవుడు తప్పస్సు చేస్తున్నపుడు పార్వతి శివ పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రి తీసుకురావడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలను పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చింది కూడా, చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పండితులు చెబుతున్నారు.
బిల్వపత్రాలతో పూజ వల్ల కలిగే ప్రయోజనాలివే: మహా శివరాత్రి నాడు బిల్వ పత్రాలను సమర్పించిన భక్తులకు ఆర్థిక కష్టాలు తీరుతాయి. అన్ని రకాలుగా సంవృద్ధి కలుగుతుందని నమ్మకం. కనుక చాలామంది శివరాత్రిన ప్రత్యేకంగా బిల్వార్చన చేస్తారు. దంపతులు ఈ రోజున బిల్వ పత్రాలతో శివపూజ చేసుకుంటే వారి దాంపత్య జీవితం అనందమయం అవుతుంది. అంతే కాదు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా జరుగుతుందని నమ్మకం.
శివాభిషేకం ఇలా..: శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని తేనెతో అభిషేకిస్తే చాలా మంచిది. చేసే ఉద్యోగంలో సమస్యలు ఉన్నపుడు వృత్తి జీవితంలో ఒడిదొడుకులు దూరం చేసుకోవడానికి ఈ అభిషేకం దోహదం చేస్తుంది. శివరాత్రిన ఈ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం సదా ఉంటుంది. శివలింగాన్ని పెరుగుతో పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరుతాయి. చెరుకురసంతో రుద్రాభిషేకం చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. అందువల్ల సంపద చేకూరుతుంది. దారిద్ర్యం నాశనం అవుతుంది.