Janmashtami 2025: ఈ ఏడాది కృష్ణాష్టమి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. అష్టమి ఘడియలు ఆగష్టు 16 శనివారం రోజంతా ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జన్మాష్టమి ఆగష్టు 16న వచ్చింది.
అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
ఆగష్టు 15 శుక్రవారం రాత్రి ఒంటిగంట 22 నిముషాలకు అష్టమి ఘడియలు మొదలయ్యాయి. అంటే శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అష్టమి మొదలైంది
ఆగష్టు 16 శనివారం రాత్రి 10 గంటల 52 నిముషాల వరకూ అష్టమి ఘడియలున్నాయి. శ్రీ కృష్ణభగవానుడి జన్మనక్షత్రం రోహిణి
ఆగష్టు 17 ఆదివారం ఉదయం 6 గంటల 48 నిముషాల వరకూ కృత్తిక నక్షత్రం ఉంది..ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమైంది. రోజంతా రోహిణి నక్షత్రం ఉంది కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?
సాధారణంగా జన్మదినం జరుపుకున్నప్పుడు తిథిని పరిగణలోకి తీసుకుంటారు..అదికూడా సూర్యోదయానితి తిథి ఉండేలా చూసుకుంటారు. జన్మ నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నాకానీ తిథిని లెక్కలోకి తీసుకుంటారు. అందుకే పంచాంగకర్తలంతా ఆగష్టు 16 శనివారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు.
శ్రీ కృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారంగా, ధర్మాన్ని స్థాపించడానికి , అధర్మాన్ని నాశనం చేయడానికి జన్మించాడు. శ్రావణమాసంలో బహుళ అష్టమి రోజు అర్థరాత్రి జన్మించాడు శ్రీ కృష్ణుడు. అర్థరాత్రి భటులందరకీ మాయ ఆవహించి నిద్రపోతున్న సమయంలో కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడిని..తండ్రి వసుదేవుడు గోకులానికి చేర్చాడు. అక్కడ యశోద పక్కనున్న చంటిబిడ్డను తీసుకుని శ్రీ కృష్ణుడిని అక్కడ ఉంచి తిరిగి దేవకి దగ్గరకు చేరుకున్నాడు. అప్పటివరకూ దేవకికి కానీ, కాపలా భటులకు కానీ మెలుకువ రాలేదు. వసుదేవుడు తీసుకొచ్చిన ఆడబిడ్డను దేవకి పక్కన పడుకోబెట్టిన తర్వాత చిన్నారి ఏడుపు విని అంతా ఉలిక్కిపడి లేచినట్టు మేల్కొన్నారు.
శ్రీకృష్ణుడి జన్మతిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారంతా..
వైష్ణవులు మాత్రం రోహిణి నక్షత్రం కూడా కలిసొచ్చేలా చూసుకుంటారు గోకులాష్టమి
శ్రీ కృష్ణభగానుడు చిన్నతనంలో గోకులంలో పెరగడం వల్ల ఈ రోజునే గోకులాష్టమిగా కూడా జరుపుకుంటారు. రోజు మొత్తం ఉపవాసం ఆచరిస్తారు కొందరు, ఓ పూట భోజనం చేస్తారు మరికొందరు. శ్రీ కృష్ణుడి ఆలయాలను సందర్శించుకుంటారు లేదంటే సమీపంలో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లివస్తారు. శ్రీకృష్ణుడిని భగవంతుడికన్నా స్నేహితుడిగా ఆరాధించేవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని స్కాంద పురాణం చెబుతోంది.
సంతాన గోపాల వ్రతం
శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి రోజు సంతాన గోపాల వ్రతం ఆచరిస్తారు కొందరు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే వివాహం కానివారికి వివాహం జరుగుతుంది, పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మిగిలినవారికి ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. భాగవతం, భగవద్గీత పఠనం
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజంతా భాగవతం, భగవద్గీత పఠించాలి. శ్రీ కృష్ణుడు అర్థరాత్రి సమయంలో దేవకీ గర్భాన జన్మించాడు. అందుకే రోజంతా ఉపవాసం ఆచరించి కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మర్నాడు ఉదయం వైష్ణవ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమిస్తారు. కృష్ణాష్టమి రోజు ఆచరించే ఉపవాసం , పూజలు మనస్సు, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. కృష్ణుని బోధనల ద్వారా సత్యం, ప్రేమ, సేవ మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణ పొందుతారు భక్తులు. భగవద్గీతలో ఉపదేశాలు జీవన మార్గదర్శనంగా ఉపయోగపడతాయి.