Mahalaya Paksha 2022: ప్రతి మనిషి తన జీవితకాలంలో మూడు రకాల ఋణాలను తీర్చుకోవాలని పెద్దలు చెబుతారు. అవేంటంటే.... దేవతల ఋణం, గురువులు అంటే ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితృల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం... భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తాం. ఈ 15 రోజులు పెద్దలకు ప్రీతిపాత్రమైనవి. ఈ ఏడాది మహాలయ పక్షాలు సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యాయి. 25వ తేదీ వరకు ఉన్నాయి. ఈ పదిహేను రోజులపాటు పితృకార్యాలు నిర్వహిస్తారు కనుక ఎలాంటి శుభకార్యాలు చేయరు..పితృదేవతలను తలుచుకుంటారు...
Also Read: దైవ చింతన లేనివారు కూడా ఈ స్వరానికి దాసోహం కావాల్సిందే
వీటిని మహాలయ పక్షాలని ఎందుకంటామంటే.. మహా భారతంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండు కోసుకుని తిందామని అనుకోగా.. ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఇక లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారి పోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి? తనకిలా ఎందుకు జరుగుతున్నదని మదనపడుతుండగా.. ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. గానీ భూలోకంలో పితృరుణం తీర్చుకోలేదు, అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది'' అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. దాంతో కర్ణుడు సూర్యుడిని ప్రాధేయపడి తిరిగి భూలోకానికి వచ్చి పితృకార్యాన్ని నిర్వహించి అన్నదానాలు చేసి, తిరిగి స్వర్గానికి వెళ్తాడు. ఇలా కర్ణుడు భూలోకానికి వచ్చిన ఈ పదిహేను రోజులకే మహాలయ పక్షమని పేరు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
ఈ మహాలయ పక్షంలో పూర్వీకులు తమవారి వద్దకు తిరిగి వస్తారని విశ్వసిస్తారు. అందుకని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధకర్మలను ఆచరించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెట్టండి. ఇది కాకుండా బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వస్త్రాదులను ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు. 15 రోజులు వీలులేనివారు కనీసం వారికి ఇష్టమైన మహాలయ అమావాస్యలో ఒకరోజైనా శ్రాద్ధకర్మలను ఆచరించాలి. అన్నదానాలు చేయడం వల్ల పెద్దల ఆశీస్సులు లభించి వంశాభివృద్ధి జరుగుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి. నిత్యం కుదరని వాళ్లు..తమ పితృదేవతలు ఏ తిథి రోజు మృతిచెందారో ఈ 15 రోజుల్లో ఆ తిథిరోజు శ్రాద్ధం నిర్వహించాలి