Pandharpur Vitthal Rukimini Mandir:  తల్లిదండ్రులను ప్రేమిస్తే చాలు...తనకు సేవచేయకపోయినా భగవంతుడు ప్రీతి చెందుతాడు. రమ్మని పిలవకపోయినా దిగివస్తాడు, వచ్చిన తర్వాత కూడా పట్టించుకోపోయినా వేయి చూస్తాడు. ఇందుకు నిదర్శనం పాండురంగ విఠల్. 

మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పండరీపురంలో పాండురంగస్వామిగా పూజలందుకుంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఓ భక్తుడి కోసం ఇక్కడకు స్వయంగా వచ్చిన స్వామివారు ఇక్కడే ఉండిపోయారు. ఆ భక్తుడి పేరే పుండరీకుడు.  

యవ్వనంలో అడుగుపెట్టినప్పటి నుంచీ వేశ్యాలోలుడిగా మారిపోతాడు పుండరీకుడు. పెళ్లి చేస్తే మార్పు వస్తుందేమో అనే ఆశతో ఉత్తమురాలితో వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. కానీ పుండరీకుడిలో మార్పురాదు. వేశ్యలను సంతోష పెట్టేందుకు సంపద మొత్తం పంచేస్తాడు. అడ్డుపడిన తల్లిదండ్రులను , భార్యను ఇంట్లోంచి గెంటేస్తాడు. బతుకుతున్నది కేవలం కామవాంఛలు తీర్చుకునేందుకే అనే భావనలో ఉండిపోతాడు. అలాంటి వ్యక్తికి ఓ మహర్షి ద్వారా కనువిప్పు కలుగుతుంది. తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రులను తిరిగి ఇంటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి వారి సేవలోనే మునిగితేలుతుంటాడు. 

పుండరీకుడిలో నిజంగా మార్పు వచ్చిందా లేదా అని గమనించేందుకు స్వయంగా దిగివస్తాడు శ్రీ కృష్ణుడు.  ఆశ్రమం బయట నిల్చుని పుండరీకుడిని పిలుస్తాడు కృష్ణుడు. వచ్చింది ఎవరో కూడాచూడడు పుండరీకుడు. తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని ఇప్పుడే బయటకురాలేనని సమాధానం చెబుతాడు. ఎండగా ఉంది కాళ్లు కాలుతున్నాయని కృష్ణుడు అంటే.. తన పక్కనే ఉన్న ఓ ఇటుకను బయటకు విసిరేసి దీనిపై నిల్చో అంటాడు. ఆ ఇటుకపై నిల్చున్న కృష్ణుడు అక్కడే వెలిశాడు. మరాఠీలో విఠ్ అంటే ఇటుక.. దానిపై వెలిసిన స్వామి కనుక విఠలుడు అయ్యాడు. ఇక పుండరీకుడి కోసం వచ్చిన స్వామి పాండురంగడిగా మారాడు. తల్లిదండ్రుల సేవలో తరిస్తూనే తనకోసం వచ్చిన స్వామిని సేవిస్తూ ఆయనలోనే ఐక్యం అయిపోయాడు పుండరీకుడు.  

శ్రీకృష్ణుడు విఠల్ గా వెలసిన ప్రదేశంలోనే ఆలయం నిర్మించారు. భీమానది తీరంలో ఉంది ఈ ఆలయం. మహారాష్ట్ర మొత్తం పాండురంగడి భక్తులు ఎందరో ఉన్నారు. పురందరదాసు, జ్ఞానేశ్వర్, నామదేవ్ , ఏకనాథుడు , భక్త తుకారాం , ఛోఖ మేళ ,  జనాబాయి సహా ఎంతో మంది పాండురంగడి సేవలో తరంచి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు. 

భీమానదిలో స్నానం ఆచరించి ముందుగా పుండరీకుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం వద్ద ఉన్న నామదేవ్, చోఖమేళ మందిరాలను దర్శించుకుని ఆ తర్వాతే  పాండురంగ స్వామి,  రుక్మిణి దేవిని దర్శించుకుంటారు. నిజమైన భక్తులకు భగవంతుడు ఇచ్చే స్థానం ఏంటన్నది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అర్థమవుతుంది. మరో విశేషం ఏంటేట ఇక్కడ తుకారం మూర్తితో పాటూ ఆయన పాదుకలు కూడా పూజలందుకుంటాయి. ఏటా తుకారం,  జ్ఞానేశ్వర్ పాదుకలను వారి వారి గ్రామాల నుంచి పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తారు. 20 రోజుల పాటూ 250 కిలోమీటర్లు నడిచి తొలి ఏకాదశికి పండరీపురం చేరుకుంటారు. దీనినే వారీ యాత్ర అంటారు. 

భక్తుడికోసం భగవంతుడు దిగి వచ్చిన ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..