మెగా కోడలు లావణ్య త్రిపాఠీ కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథలు, క్యారెక్టర్లకు ఓటు వేస్తూ వస్తున్నారు. సినిమాల ఎంపికలో ముందు నుంచి ఆవిడ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న లావణ్య త్రిపాఠి, ప్రస్తుతం 'సతీ లీలావతి' చేస్తున్నారు.
'సతీ లీలావతి' ఫస్ట్ లుక్ విడుదలLavanya Tripathi latest movie Sathi Leelavathi First Look Released: లావణ్య త్రిపాఠిప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'సతీ లీలావతి'. ప్రెగ్నెంట్ కావడానికి ముందు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు ఆవిడ. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గా దేవి పిక్చర్స్ పతాకం మీద నాగ మోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో లీలు పాత్రలో లావణ్య త్రిపాఠి, సేతు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
'సతీ లీలావతి' చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా 'భీమిలీ కబడ్డీ జట్టు', సుధీర్ బాబు హీరోగా 'ఎస్.ఎం.ఎస్' (శివ మనసులో శృతి) వంటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీశారాయన. ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీన పడుతోందని, అందుకు కారణం మనుషుల మధ్య ఎమోషనల్ బాండింగ్ లేకపోవటమేనని, భావోద్వేగాలే బంధాలను కలకాలం నిలుపుతాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత నాగ మోహన్ తెలిపారు.
Also Read: మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ నెల... హరిహర వీరమల్లుకు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
'సతీ లీలావతి' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ... ''రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలంటే? వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎంత బలంగా ఉండాలనేది చెప్పే చిత్రమిది. భార్య భర్తల మధ్య అనుబంధాన్ని భావోద్వేగభరితంగా మాత్రమే కాకుండా వినోదాత్మకంగానూ చెప్పే ప్రయత్నమే మా 'సతీ లీలావతి'. చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం విడుదల చేయడానికి మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కిస్తున్నా'' అని అన్నారు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న 'సతీ లీలావతి' సినిమాకు కళా దర్శకత్వం: కోసనం విఠల్, కూర్పు: సతీష్ సూర్య, ఛాయాగ్రహణం: బినేంద్ర మీనన్, మాటలు: ఉదయ్ పొట్టిపాడు, సంగీతం: మిక్కీ జె. మేయర్, సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాణ సంస్థ: దుర్గాదేవి పిక్చర్స్, నిర్మాత: నాగ మోహన్, దర్శకత్వం: తాతినేని సత్య.