Ganesh Chaturthi 2025 Puja Shubh Muhurat : ఆగష్టు 27 బుధవారం వినాయక చవితి.. ఈ రోజు ఏ సమయం వరకూ చవితి ఘడియలున్నాయి? పూజ ఏ సమయంలో చేయాలి? ఎలాంటి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించాలి? పూర్తి వివరాలు ఇవిగో..

శ్లోకంశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!

శ్లోకంవక్రతుండ మహాకాయ..కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమే దేవ..సర్వకార్యేషు సర్వదా

ఏ కార్యమైనా విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రారంభిస్తే విజయవంతం అవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏ పని అయినా ప్రారంభించేందుకు ముందుగా , ఎంత పెద్ద పూజ నిర్వహించినా, యజ్ఞయాగాదులు తలపెట్టినా ముందుగా గణేషుడి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే తలపెట్టే పనిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా విజయవంతంగా పనిని పూర్తిచేసేందుకు వినాయకుడు సహకరిస్తాడని నమ్మకం.  2025లో ఆగష్టు 27 బుధవారం వినాయ చవితి వచ్చింది. ఈ రోజు వినాయక పూజ ఆచరిస్తారు.  

2025 వినాయక చవితి పూజ చేసుకునే ముహూర్తం ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది. చవితి నుంచి తొమ్మిది రోజుల పాటూ చతుర్థశి వరకూ పూజలందుకుని..అనంతరం అత్యంత వైభవంగా గంగమ్మ ఒడికి తరలి వెళతాడు గణపయ్య. ఈ ఏడాది ఆగష్టు 27 బుధవారం వినాయక వచ్చింది.  

2025 ఆగష్టు 26 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాల వరకూ తదియ ఉంది..ఆ తర్వాత చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి

ఆగష్టు 27 బుధవారం మధ్యాహ్నం 1.58 నిముషాల వరకూ చవితి ఘడియలున్నాయి

అంటే.. వినాయక చవితి పూజ ఆగష్టు 27 మధ్యాహ్నం లోగా పూర్తిచేసుకోవాలి

వర్జ్యం: ఆగష్టు 27 మధ్యాహ్నం 2.30 నుంచి 4.17 వరకు ఉంది

దుర్ముహూర్తం: ఆగష్టు 27 ఉదయం 11.37 నుంచి 12.27 వరకు

అమృత ఘడియలు: ఆగష్టు 27 రాత్రి 1.01 నుంచి 2.46 వరకు

వర్యం, దుర్ముుహూర్తం ఉన్న సమయంలో వినాయక పూజ ప్రారంభించకూడదు. అంటే వర్జ్యం ఎలాగూ చవితి ఘడియలు వెళ్లిపోయిన తర్వాత వస్తోంది.. పరిగణలోకి తీసుకోవాల్సన అవసరం లేదు. దుర్ముహూర్తం మాత్రం ఉధయం పదకొండున్నర నుంచి గంటపాటూ ఉంటోంది. అంటే ఉదయం పదకొండున్నర లోగా పూజ ప్రారంభించాలి లేదంటే.. పన్నెండున్నర దాటిన తర్వాత చవితి ఘడియలు దాటిపోకుండా పూజ చేసుకోవాలి. వర్జ్యం, దుర్ముహూర్తం సమయంలో పూర ప్రారంభించకూడదు కానీ పూజ ప్రారంభించిన తర్వాత ఈ రెండు ఘడియలు మొదలైనా పర్వాలేదు. కేవలం పూజ ప్రారంభ సమయమే పరిగణలోకి తీసుకుంటారు.

ఇలాంటి  విగ్రహం కొనుగోలు చేయండి

పూజకోసం తీసుకొచ్చే వినాయక విగ్రహం తొండం ఎడమవైపు ఉండాలి రసాయనాల్లో ముంచితీసిన విగ్రహాలు కాకుండా మట్టి గణపయ్యను తీసుకురండి ఇంట్లో ఎన్నిరోజులు మీరు వినాయకుడిని ప్రతిష్టించి ఉంచుతారో అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం నైవేద్యం సమర్పించండి.  

విగ్రహ నిమజ్జనం కోసం నదులు, సముద్రాలు, కొలనులు వద్దకు వెళ్లండి..అవకాశం లేకపోతే శుభ్రం చేసిన బకెట్లలో నీళ్లు నింపి అందులోనూ వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు. ఆ నీటిని చెట్లకు పోయండి

గమనిక: పంచాంగంలో పేర్కొన్న వివరాలు, పండితులు చెప్పిన వివరాల ఆధారంగా అందించిన కథనం ఇది. ఆయా ప్రాంతాల ఆధారంగా సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. మీరు ఈ వివరాలను పరిగణలోకి తీసుకునే ముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి.