Ganesh Chaturthi 2022
పత్రి పూజ వెనుక పరమార్థం
వినాయకుడిని 21 పత్రితో పూజిస్తా. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట.
నిమజ్జనం వెనుక పరమార్థం
నవరాత్రులు పూజించిన తర్వాత వినాయక ప్రతిమను చెరువులోనో, కుంటలోనూ నిమజ్జనం చేయడం ఆచారం. ఈ నిమజ్జనం వెనుకున్న పర్యావరణ రహస్యం ఏంటంటే.. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.
Also Read: గడ్డిపోచ(గరిక) అంటే లంబోదరుడికి ఎందుకంత ప్రీతి!
మాచీపత్రం: మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.
బృహతీపత్రం: దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.
బిల్వపత్రం : ఈ ఆకు పసరు చర్మ దోషాలను నివారిస్తుంది.
దూర్వాపత్రి: రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.
దత్తూరపత్రం: ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులతు మందు
బదరీ పత్రం: అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.
అపామార్గ పత్రం : గాయాలను తగ్గించడంతో పాటూ చర్మ సమస్యలన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది.
చూతపత్రం: మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కరవీర పత్రం: తలలో చుండ్రు తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కావున తగిన జాగ్రత్తలు తీసుకుని వాడాలి.
విష్ణుక్రాంతపత్రం: దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.
దాడిమీపత్రం: శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.
దేవదారుపత్రం: దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ర్పేరణకు ఉపయోగపడుతుంది.
మరువకపత్రం: నరాల ఉత్ప్రేరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది.
సింధువారపత్రం: వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.
జాజీపత్రి: ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
గండకీపత్రం: కడుపులో నులిపురుగులను హరిస్తుంది.
శమీపత్రం: ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి స్వచ్ఛంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది.
అశ్వత్థపత్రం: శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.
అర్జునపత్రం: దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది.
అర్కపత్రం: తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.
తులసీదళం : దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది( కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులదీ దళాలతో వినాయకుడికి పూజ చేస్తారు)
Also Read: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు!
ఈ పత్రాలన్నింటితో పూజించి చివరిగా ‘ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి’ అంటూ పూజను ముగించాలి. అయితే ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం వల్ల నిమజ్జనం వెనుకున్న ఉద్దేశాలు దెబ్బతింటున్నాయి. ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికీ, ఆడంబరానికీ పెద్ద పీట వేస్తున్నారు. అందుకే మట్టి గణేషుడిని 21 రకాల పత్రిలతో పూజించి నిమజ్జనం చేయాలి.