వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కు ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇంటిలోని ప్రతి దిక్కుని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కును విస్మరించినా మనకు తెలియకుండానే ఇంట్లోకి నెగెటివిటి ప్రవేశించవచ్చు. కనుక ఇంట్లోని ఏ దిశలో ఏ వస్తువులను అలంకరిస్తున్నాం, ఉంచుతున్నామనే దాన్ని బట్టి ఇంట్లోకి పాజిటివిటి లేదా నెగెటివిటి ఆధారపడి ఉంటుంది. ఈ నెగెటివ్ లేదా పాజిటివ్ ప్రభావం తప్పకుండా ఇంట్లో నివసించేవారి మీద ఉంటుంది. ఇంటిలోని ఏభాగంలో ఎలాంటి నిర్మాణం జరగాలి? ఎలాంటి వస్తువులు ఉంచాలనే విషయాలను వాస్తు శాస్త్రం విస్తృతంగా చర్చిస్తుంది.


వాస్తును అనుసరించి నైరుతి దిక్కును రాహు – కేతు దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన వస్తువుల వల్ల నెగెటివిటి పెరుగుతుంది. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.


 ఈ వస్తువులు నైరుతిలో అసలు పెట్టకూడదు



  • నైరుతిలో పూజగది లేదా ప్రార్థనా స్థలం అసలు ఏర్పాటు చేసుకోకూడదు. ఈ దిక్కున మనసు ఏకాగ్రతతలో ఉండదు. అందువల్ల పూజ జరపడానికి అనుకూలంగా ఉండదు. ఈదిశలో ఏర్పాటు చేసిన దేవి లేదా దేవతల వల్ల పూజా ఫలం లభించదు.

  • ఈ దిశలో నీటి సంప్ ఉండకూడదు. దానివల్ల వాస్తు దోషం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కానీ రూఫ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు.

  • ఈ దిక్కున టాయిలెట్ నిర్మాణం చేస్తే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంట్లోని వ్యక్తుల అభివృద్ధి ఆగిపోతుంది. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి.

  • పిల్లల స్టడీ రూం కూడా ఈ దిక్కుగా ఉండకూడదు. ఈ దిక్కున ఏకాగ్రత కుదరడం కష్టం. చదివినవి గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ రాయడం, చదవడం మాత్రం అంత మంచిది కాదు.

  • గెస్ట్ రూం కూడా నైరుతి దిక్కున ఉండడం మంచిది కాదు. రాహు – కేతు దిశ కావడం మూలంగా ఇక్కడి ఉండి వారికి ప్రవర్తన, వ్యవహారంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. అతడు అందరితో అనుచితంగా ప్రవర్తించవచ్చు. అందువల్ల ఈ దిక్కులో గెస్ట్ రూం కూడా ఉండకూడదు.

  • ఈ దిక్కులో బరువుగా ఉండే వస్తువులు ఉంచడం మంచిది. బిరువాలు, త్రిజోరి, బుక్ షెల్ఫ్ వంటివి ఈ దిక్కున ఉంచాలి. ఇంటిలోని మిగతా భాగాల కంటే ఈ దిక్కున ఎక్కువ బరువు ఉండాలి. అంతేకాదు ఈ దిక్కున ఇతర దిక్కులతో పోలిస్తే ఎత్తు ఎక్కువగా ఉండాలి.

  • నైరుతిలో అవుట్ హౌజ్ ఉండడం మంచిది. అవుట్ హౌజ్ నిర్మించేంత స్తోమత లేదని అనుకునేవారు ఇంటిలోని ఆ మూలన కాస్త ఎత్తు పెంచి ఉంచుకోవడం మంచిది.

  • నైరుతి వాస్తుదోశ నివారణకు ఆ దిక్కున మట్టి విగ్రహాల తో అలంకరించుకోవచ్చు. లేదా రాహు యంత్రం కూడా అక్కడ పెట్టుకోవచ్చు.

  • నైరుతిలో మొక్కలు పెంచకూడదు. ఇక్కడ తగినంత సూర్యరశ్మి అందక పోవడం వల్ల మొక్కుల ఏపుగా పెరగవు.


Also Read: మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం ఇవి ఉండకూడదు