ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. కానీ ఆటంకం ఏర్పడితే దాన్ని తొలగించుకోవడం అత్యవసరం. ఇలాంటి ఆటంకాలను తొలగించేందుకు వాస్తులో చాలా నియమాల గురించి వివరించారు.


ఇంటిని అందంగా అలంకరించుకోవడం అందరికీ ఇష్టమే ఉంటుంది. అయితే ఇలా అలంకరించుకునేందుకు ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తున్నాం అనే విషయం మీద పెద్దగా దృష్టి నిలపరు. ఇలా చెయ్యడం వల్ల తెలియకుండానే చిక్కుల్లో పడుతుంటారు. ఇది ప్రధానంగా శాస్త్రం తెలియకపోవడం వల్ల కలిగే పరిస్థితి. ఇలాంటి వస్తువుల ఇంట్లో ఉండడం వల్ల కలిగే నష్టాలు, పరిహారాలను తెలుసుకుందాం.


కొన్ని వాస్తు ప్రాథమిక నియమాలు పాటించడం ద్వారా జీవితంలోని దురదృష్టాన్ని పారద్రోలడం సాధ్యమే. మరోవైపు ఈ నియమాలను పాటించకపోతే జీవితాన్ని దురదృష్టం వెంటాడుతుంది. జీవితం సజావుగా సాగడానికి ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో తెలుసుకోవడం అవసరం.


చాలామంది అందవిహీనంగా కనిపించే వస్తువులను దిష్టికి విరుగుడుగా ఇంటి బయట పెడుతుంటారు. ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని చాలా మంది ఇంటిబయట రాక్షసుడి ముఖం పటాన్ని పెడుతుంటారు. కొంత మంది పాత చెప్పులు, చీపుర్లు, టైర్లు ఇలా కొన్ని వస్తువులను ఉంచుతుంటారు. అవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని భావిస్తారు. కానీ ఇవి ఇంటి బయట ఉంచడం అంత మంచిది కాదని వాస్తు చెబుతోంది. ఇవి ఇంట్లో నివిసించేవారికి దురదృష్టాన్ని తెస్తాయి.


గుర్రపు నాడ


కొంత మంది ఇంటి బయట గుర్రపు నాడ పెట్టుకుంటారు. ఇది నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని నమ్మకం. కానీ జ్యోతిష్యంలో గానీ, వాస్తులో గానీ.. దీని గురించి ఎక్కడా వివరించలేదు. అంతేకాదు వాస్తు గుర్రపు నాడ అశుభం అని కూడా చెబుతోంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారించేందుకు ఇంటి బయట గణపతి విగ్రహాన్ని పెట్టాలి. గుమ్మం దగ్గర కూర్చిని ఉండే గణపతి శుభ్రప్రదమని శాస్త్రం చెబతోంది. ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థి తరోజుల్లోనూ, ప్రతీ బుధవారం గణపతి పూజ చేసుకోవడం శ్రేష్ఠం. ఇంటికి ఇది శుభప్రదం.


మొక్కలు వద్దు


ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టకుంటే అది అంత మంచిది కాదట. ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయట. అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తాయట. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు లేదా చెట్లు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.


పరిశుభ్రత ముఖ్యం


ఇంటి ప్రవేశ ద్వారం లేదా వాకిలి ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి ప్రవేశించే మురికి ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఎదురుగా గొయ్యి లేకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున ఏర్పడినా కూడా దాన్ని వెంటనే చదును చేస్తుకోవాలి. లేదంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది. అందుకే ఇంటి ప్రధాన గుమ్మం శుభ్రంగా అందంగా అలంకరించి పెట్టుకోవాలి. సూర్యోదయానికి ముందే ఇంటి వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి సంధ్యా లక్ష్మీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తుందని విశ్వాసం. అలాగే సాయంత్రం కూడా తప్పకుండా ఇంటి వాకిలి చిమ్మి శుభ్రంగా ఉండాలి.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.