రోజూ మనం తెలిసో తెలియకో కొన్ని చెయ్యకూడని పనులు చేస్తుంటాం. అయితే, వాటికి ఊహించని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. శ్రమకు తగిన ఫలితం ఎందుకు రావడం లేదనే బాధ వెంటాడుతుంది. అలాంటి చెయ్యకూడని పనులు అలవాటుగా మారితే లక్ష్మీ కటాక్షం దొరకదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా దారిద్ర్యం వెంటాడుతుంది. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఆ గది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలంటే.. ఎలాంటి పనులు చేయకూడదనేది వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
- పడుకునే సమయంలో మంచం దగ్గర మంచి నీళ్లు పెట్టుకొనే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే.. వాస్తు ప్రకారం అది అశుభం. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందువల్ల రకరకాల సమస్యలు ఎదురు కావచ్చు.
- మనలో చాలామంది నిద్రకు ముందు పుస్తకం లేదా పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఏదైనా చదివితే కానీ నిద్రపోరు. ఇలా చదువుకోవాలని అనుకునే పుస్తకాలు కొంచెం చదివి దిండు కింద పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు తీవ్రంగా మారుతాయి. లేని కొత్త సమస్యలు వస్తాయి.
- ఈ మధ్య కాలంలో చాలా మందికి పడక గదిలో భోంచేసే అలవాటయ్యింది. ఇలా మంచంపై కూర్చుని తినడం అంత మంచి అలవాటు కాదు. కొందరు మంచంపై కూర్చుని తినకపోయినా తిన్న తర్వాత ఎంగిలి పాత్రలు అలాగే మంచం పక్కన పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇది అసలు మంచిది కాదు. రాత్రిపూట పీడకలలు వస్తాయి. అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా అడ్డంకులు రావచ్చు. కాబట్టి పడకగదిలో భోంచెయ్యడం, భోజనం తర్వాత పాత్రలు అక్కడే పెట్టుకోవడం అంత మంచిది కాదు.
- చాలా మంది మహిళలు పడుకునే ముందు తాము అలంకరించుకున్న నగలు తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా నగలు దిండు కింద పెట్టకుంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. కాబట్టి నగలు తీసి సరైన స్థానంలో భద్రపరిచిన తర్వాత మాత్రమే నిద్రకు ఉపక్రమించడం మంచిది.
- ఒకసారి వేసుకున్న బట్టలు మరోసారి వేసుకున్నాక ఉతకడానికి వెయ్యాలని చాలా మంది అనుకుంటారు. తరచుగా ఉతకడం వల్ల బట్టలు పాడైపోతాయని ఇలా చేస్తుంటారు. అయితే ఒకసారి వాడిన బట్టలు ఉతక కుండా మంచం మీద వెయ్యకూడదు. కొందరు అలా వేసి వదిలేస్తారు కూడా. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కోవడం లేదా ఒకసారి వేసుకున్నవాటిని సరైన స్థానంలో పెట్టుకోవడం అవసరం.