Vastu Tips In Telugu: ఏ ఇంటికైనా ప్ర‌ధాన ద్వారం అత్యంత ముఖ్య‌మైన‌ది. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఇల్లు కట్టే ముందు వాస్తు నిపుణులను పిలిపించి ఇంటి నిర్మాణానికి సరైన మార్గదర్శకత్వం తీసుకుంటారు. ఇంట్లో ప్రతి మూల వాస్తు ప్రకారం నిర్మిస్తారు. ఇంటి నిర్మాణంతో పాటు ఆ ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో నిర్మించాలో కూడా శ్రద్ద తీసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో అతి ముఖ్యమైన భాగం దాని ప్రధాన ద్వారం. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎలా ఉండాలి, ద్వారం వద్ద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.


ప్రధాన ద్వారం వద్ద మురికి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద మురికి ఉండకూడదు. చాలా మంది ఇంటి మెయిన్ డోర్ దగ్గర డస్ట్ బిన్ పెట్టుకుంటారు. చెత్తను అక్కడ ఉంచడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెమ్మదిగా మాయ‌మ‌వుతుంది. అంతేకాకుండా లక్ష్మీ దేవి ఆ ఇంట్లో నివసించదు, ప్రతికూల శక్తి ఆ ఇంట్లో తిష్ఠ వేస్తుంది.


ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, చీపురు
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఇంటి మెయిన్ డోర్ వ‌ద్ద‌ బూట్లు, చెప్పులు తీసేసి లోప‌లికి వెళ్లే అలవాటు ఉంటుంది. కానీ ఈ ఇది పూర్తిగా తప్పు. పాదరక్షలు, చెప్పులు తలుపు వద్ద ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో ఆర్థిక సంక్షోభం, ఇంట్లోని వ్యక్తుల మధ్య పరస్పర శత్రుత్వానికి దారి తీస్తుంది. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీపురు పెట్టకూడదు, ఇది అశుభ సంకేతం. చీపురును ఎల్లప్పుడూ ఇంటి లోపల దాచాలి, చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, ఇంటి వెలుపల ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.


పాడైపోయే వస్తువులు
సాధారణంగా ప్రజలు తమకు పనికిరాని వాటిని బయటకు తీసి ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఉంచుతారు. ఇలాంటి హానికరమైన వస్తువులు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నందున, ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించడం ప్రారంభిస్తాయి. ఫ‌లితంగా కుటుంబంలో ఆర్థిక సంక్షోభం పెరగడం ప్రారంభమవుతుంది కాబట్టి దీనిని నివారించాలి.


బురద, మురికి నీరు
ఇంటి గుమ్మం వద్ద బురద, మురికి నీరు పేరుకుపోకూడదు. తరచుగా వర్షాలు కురుస్తున్నప్పుడు, చాలా మంది ప్రజల ఇళ్ల వెలుపల మురికి నీరు నిండిపోయి బురద పేరుకుంటుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురవుతారు.


ఈ మొక్కలను పెట్టకండి
ఇంటి గుమ్మం వద్ద మొక్కలను ఉంచడం వల్ల ఇంటి అందం నాలుగు రెట్లు పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు చాలా అందమైన వస్తువులు కూడా వికారంగా మారవచ్చు. అందుకే ఇంటి మెయిన్ డోర్‌కు ఎదురుగా చెట్లు, మొక్కలు ఉంచ‌కూడదు. తలుపు ప‌క్క‌న ఉండేలా చూసుకోవాలి. అయితే ఇంటి బయట ముళ్ల చెట్లను, మనీప్లాంట్‌ను నాటకూడదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి సంప‌ద దూరమై కుటుంబం ఆర్థికంగా బలహీనపడుతుంది.


ఇంటి మెయిన్ డోర్ ఎలా ఉండాలి
వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి ప్ర‌తిమ ఉంచాలి. ఇలా చేయడం వల్ల గణేశుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి. గణేశుడి ప్ర‌తిమ ఉంచ‌డం ద్వారా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు జరగని ప‌నులు జరగడం ప్రారంభిస్తాయి. ప్ర‌ధాన ద్వారం వద్ద గణపతిని ఉంచిన తరువాత, ఆయ‌న‌ను రోజూ పూజించాలి, ఇది విశేష ఫలితాలను ఇస్తుంది.


ఇంటి బయట అందమైన పూల మొక్క‌
మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద అందమైన పూల మొక్కను ఉంచండి, ఇది ఇంటి అందాన్ని పెంచుతుంది. ఈ పువ్వుల  సువాసనతో సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి వెలుపల అందమైన పూల మొక్క‌లు ఉంచ‌డం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొల‌గిపోతాయి, ఇంట్లో ఆర్థిక సమ‌స్య‌లు ఉండవు.


ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదాలు
ల‌క్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తోంద‌ని గుర్తుచేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది, ఇంటి ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ క్షీణించదు.


Also Read : స్టడీ రూమ్‌లో ఈ వస్తువులు ఉంటే మీ పిల్ల‌లు చ‌దువులో ముందుంటారు!


తులసి మొక్క
హిందూ ధ‌ర్మంలో తులసి మొక్కకు ప్ర‌త్యేకత ఉంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను పూజిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్క చాలా శుభప్రదమైనది. ఇంటి బయట నాటితే, అది ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గృహంలో ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది.


స్వస్తిక్‌, ఓం చిత్రాలు
స్వస్తిక్‌, ఓం చిత్రాల‌ను ప్ర‌ధాన ద్వారంపై ఉంచాలి. ఓం శబ్దం, దాని ప్రకాశం ఇంట్లోని వ్య‌క్తుల‌పై సానుకూల ప్ర‌భావం చూపుతుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read : లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?