Vastu Tips In Telugu: కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల వాటి ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి. అందుకే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్త వహించాలి. నిత్యం పనులు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏవో వస్తువులు చేజారి కిందపడుతుంటాయి. గాజు, పింగాణి వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వంటగదిలో వినియోగించే వస్తువుల విషయంలో మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు జారి కిందపడతుంటా. ఆ మాత్రం ఒలకడం పెద్ద సమస్య కాదుకానీ ఉన్నపాటుగా అవి మీ చేతుల్లోంచి కిందకు పడిపోతే మాత్రం మీ భవిష్యత్ కి ఓ హెచ్చరిక అంటున్నారు వాస్తుపండితులు. ముఖ్యంగా చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడకూడదు. ఒకవేళ పడితే జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకరి చేతి నుంచి ఏదైనా వస్తువు కింద పడితే ఎలాంటి అశుభం జరుగుతుందో సూచిస్తోంది వాస్తు శాస్త్రం. 


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!


పాలు కిందపడకూడదు


చేతిలోంచి పాలు కిందపడకూడదు. ఇలా జరిగితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. పాలు చిందించడమంటే ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు సూచన అంటారు పండితులు. మరి గృహప్రవేశం రోజు పాలుపొంగితే మంచిది అంటారు కదా అనే సందేహం రావొచ్చు...అయితే గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిదే కానీ ఆ తర్వాత పదే పదే పాలు పొంగడం..పాల గిన్నె, గాజులు పడిపోవడం కూడా దురదృష్టానికి సూచన. ఎందుకంటే పాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. కుటుంబంలో ప్రతికూల శక్తి పెరిగిందని ఇది సూచిస్తుంది.


ఉప్పు చేజారనీయొద్దు


ఉప్పుని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా చెబుతారు...శనిబాధలు తొలగించుకునేందుకు దానం కూడా చేస్తారు. అయితే చేతిలోంచి ఉప్పు అకస్మాత్తుగా పడిపోతే రానున్న కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని అర్థం. అంటే త్వరలో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయని సూచన. ఇంకొందరికైతే ఉప్పు చేజారిపడితే పతనానకి దగ్గరగా ఉన్నారు అప్రమత్తంగా ఉండండి అనే హెచ్చరిక అనికూడా చెబుతారు. 


Also Read:  ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!


ఆహారంపై నిర్లక్ష్యం వద్దు


కడుపు నింపు ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు అస్సలు చేజారకూడదు. అంటే అన్నపూర్ణాదేవిని అవమానిస్తున్నట్టే. ఈ సంఘటన ద్వారా ఆ వ్యక్తికి రానున్న రోజుల్లో ఆహార కొరత తప్పదనే హెచ్చరిక...ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పదు. అందుకే అన్నం తినేముందు మొదటి ముద్దను కళ్లకు అద్దుకుని దేవుడిని నమస్కరించుకుని తింటారు కొందరు. మరికొందరు ప్లేటులో వడ్డించుకున్న ఆహార పదార్ధాలను సగం తిని సగం వదిలేస్తుంటారు. అందరి మధ్యా తినేటప్పుడు కూడా మొత్తం తినేస్తే ఏమనుకుంటారో అనే భావనతో కొంత ఆహారం విడిచిపెట్టి చేయి కడిగేసుకుంటారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో ఆర్థిక, ఆహార ఇబ్బందులు తప్పవంటున్నారు వాస్తు నిపుణులు.


నల్ల మిరియాలు


వంటిట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవి మీ చేతిలోంచి జారితే దేనికి సూచన అంటే.. రాబోయే రోజుల్లో  మీ సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉండొచ్చు.


పూజాఫలకం


పూజా ఫలకం కిందపడిందంటే అస్సలు మంచిది కాదని పురాణాల్లో ఉంది. కుటుంబంలో పెద్ద సంక్షోభానికి హెచ్చరిక ఇది. అలాంటి సందర్భాల్లో దేవుడి దగ్గర దీపం వెలిగింది ఆ సంక్షోభాన్ని తొలగించమని భగవంతుడిని ప్రార్థించాలని చెబుతోంది వాస్తు శాస్త్రం.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.