తిరుమల :  వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఈ మేరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంకోసం టోకెన్లు జారీ చేస్తోంది. ఆ 10 రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. 


టోకెన్లు తీసుకోవాల్సిన తేదీలివే
జనవరి 10 శుక్రవారం , 11 శనివారం , 12 ఆదివారం రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే జనవరి 09 ఉదయం 5 గంటల నుంచి తిరుపతి, తిరుమలలో టోకెన్లు ఇస్తారు.  
జనవరి 13 నుంచి 19 వరకూ మిగిలిన ఏడురోజుల్లో ఓ రోజుకారోజు ఓరోజు ముందుగా టోకెన్లు ఇవ్వనున్నారు.  
 
తిరుపతి , తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రాలివే


భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తులు టోకెన్లు తీసుకోవచ్చు.


భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో  టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 


ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఏరోజూకారోజు ఓ రోజు ముందస్తుగా టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు తిరుపతి  భూదేవి కాంప్లెక్స్‌,  విష్ణు నివాసం, శ్రీనివాసంలో  జారీ చేస్తారు. 


జనవరి 10 నుంచి 19 వరకూ 10 రోజుల పాటూ కేవలం టోకెన్లు తీసుకున్న భక్తులకే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ టోకెన్లు లేని భక్తులకు అనుమతి  ఉండబోదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 


సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు టీటీడీ అధికారులు. అయితే ప్రోటోకాల్‌ పరిధిలో ఉన్న ప్రముఖులు వస్తే మాత్రం వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్ద టీటీడీ మమ్ముర ఏర్పాట్లు చేసింది.  


నెలకో రాశిలో సంచరించే సూర్యుడు మకరంలోకి అడుగుపెట్టినప్పుడు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఈ ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..ఈరోజు నుంచి దేవతలకు పగటి సమయం ప్రారంభమవుతుంది. ఇదే రోజు గరుడవాహనంపై ముక్కోటి దేవతలతో కలసి విష్ణువు భూలోకంలో అడుగుపెడతాడు. స్వర్గద్వారాలు తెరిచి ఉండే ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఉత్తర ద్వార దర్శనంకోసం పోటెత్తుతారు..


Also Read: మహా కుంభమేళాకి ప్రయాగ్ రాజ్ లో భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC స్పెషల్ ట్రైన్స్!



శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం


శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  


ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  


నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  


నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  


తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  


ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |


Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!