Vaikunta Dwara Darshan Tickets: తిరుపతి :కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశినాడు మూలవిరాఠ్ ను దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించటం ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందుతారని నమ్మకం. కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షణ ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని భక్తుల ఆకాంక్ష. దీని కోసం పరితపిస్తుంటారు ప్రతి సంవత్సరం. అయితే ఆ గఢియలు రానే వచ్చాయి. తిరుమలేశుని వైకుంఠ ఏకాదశి పర్వదినంపై ప్రత్యేక కథనం..
తిరుమలలోనూ వైకుంఠ ద్వారం
ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం సాంప్రదాయం. ప్రతి వైష్ణవాలయంలోనూ ఉన్నట్లే తిరుమలలోనూ ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ద్వారం ఉంది. అయితే అది ఎక్కడ ఉన్నది అనేది చాలా మందికి తెలియదు. రోజు లక్షల సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నా, ఆలయంలోకి వెళ్ళగానే స్వామిని దర్శించుకునే అత్రుతలో అన్ని మరిచిపోతారు. అసలు స్వామి రూపం చూడటానికి టైం ఉండదు. మరి గర్బగుడి ఆకారం స్వామి ఆలయంలో నిర్మించబడిన ఈ మహా వైకుంఠ మార్గం ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియని ప్రశ్న. అయితే విష్ణువు ఉండేచోటు వైకుంఠం. ఆ వైకుంఠ వాసుణ్ణి చేరేందుకు వైకుంఠ మార్గంకు వెళ్ళాల్సిందే.. ఈ మార్గం పరమ పవిత్రం. మనసును శ్రీహరిపై ఉంచి, సమస్త పాప, పీడలను వదిలించు కునేందుకు మానవాళికి లభించిన విశిష్టమైన తలుపులివి. నరులకే కాదు. సమస్త దేవతలకూ పీడానివారిణి ఈ మార్గం. తిరుమలేశుని ఆలయంలోనూ ఉత్తర దిశన ఉన్న వైకుంఠ ద్వారం భక్తుల పాపాలను పరిహరిస్తోంది. శ్రీవారి ఆలయంలో వకుళామాత పోటుకు ఉత్తరాన బంగారు బావికి సమీపంలో ఓ ప్రవేశ మార్గం ఉంది. దీన్నే వైకుంఠద్వార ప్రదక్షిణంగా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ద్వాదశి రెండు రోజుల్లోనూ భక్తులను ఈ ద్వారం గుండానే వెళ్ళుతారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయంలో మరణించిన పుణ్యాత్ము లందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతాయి.
దేశంలో ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో ప్రవేశిస్తే తిరుమలలో మాత్రం వైకుంఠ ప్రదక్షణ చేస్తారు. ఉత్తర ద్వారంలో ఏకాదశినాడు ద్వారాలు తెరవగానే ఉత్పవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. కాని తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం వైకుంఠ మార్గంలో ఏకాదశి రోజున ఉత్సవమూర్తులను తీసుకెళ్ళరు. తిరుమల శ్రీవారి ఆలయం, దేశంలో ఉన్న వైష్ణవ ఆలయాలకు మధ్య తేడా ఉండటం వల్ల కొన్ని మార్పులు చేశారు. వైష్ణవ ఆలయాలలో కొన్నింటిని ఆలయాన్ని నిర్మంచి తర్వాత మూలవిరాట్ను ప్రతిష్టిస్తారు. కానీ తిరుమల శ్రీవారు స్వయంభుగా వెలసిన 9 అడుగు నిలువెత్తు సాలిగ్రామశిల. అందువల్ల ముందు మూలవిరాట్ వెలసిన తర్వాత కాలానుగునంగా చక్రవర్తులు, రాజులు, రారాజులు శ్రీవారి ఆలయాన్ని అంచలంచలుగా నిర్మించారు. ఇక్కడ ముందుగా తిరుమలేశుడే, ఆ తరువాతే ఆలయం నిర్మాణం జరిగింది. అందువల్ల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చెయలేదు.
గర్భాలయానికి దగ్గరగా ఉన్న వైకుంఠ ప్రదక్షణ మార్గాన్ని వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు మాత్రమే శ్రీనివాసుడు కొలువైన గర్భాలయం అనుకుని ఉన్న ప్రకారాలను చూడగలం. ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షణ చేసే భక్తులు మనసునిండా స్వామి వారిని నింపుకుని, గోవింద గోవింద అంటు నామ స్మరణలు చేస్తుంటారు. అందుకే అన్ని పర్వదినాల కంటే ముక్కోటి ఏకాదశినాడు స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. క్షణకాలం స్వామి వారిని చుడటానికి రోజుల తరబడి క్యూలైల్లో వేచి ఉంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జనవరి 2,3వ తేదీన జరిగే స్వామి వారి ఏకాదశి, ద్వాదశికి తిరుమలను ముస్థాబు చేసింది. అయితే గత ఏడాది దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు అంగీకారంతో పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ వస్తుంది. అయితే ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మోక్షమార్గమైన వైకుంఠ మార్గం గుండా వెళ్ళనున్నారు.