Nava Guruvara Vratam : సాయిబాబాపై తనకున్న భక్తిని నమ్మకాన్ని చాటి చెబుతూ నవ గురువార వ్రతం ప్రారంభిస్తున్నారు మెగా కోడలు ఉపాసన. జూలై 10 గురు పౌర్ణమి గురువారం సందర్భంగా నవగురువార వ్రతం ప్రారంభిస్తున్నారు.  రామ్ చరణ్ కి అయ్యప్ప అంటే ఇష్టమని, తాను సాయిబాబా భక్తురాలిని అని చెప్పారు ఉపాసన. కొన్ని క్లిష్టపరిస్థుల్లో ఉన్నప్పుడు సాయిబాబా వ్రతం గురించి తెలుసుకున్నానని చెప్పిన ఉపాసన..ఆ కథ చదివిన తర్వాత ఉపశమనం లభించిందని అందుకే ఈ వ్రతం ఆచరిస్తున్నా అని చెప్పారు. 

సాయిబాబా 9 గురువారాల వ్రతం ఏంటి?  నవ గురువార వ్రత మహత్యం ఏంటి?  9 గురువార సాయిబాబా వ్రత నియమాలేంటి?

స్త్రీ పురుష బేధం లేదు..సాయిబాబా భక్తులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు  కుల మతాలతో సంబంధం లేదు..ఎవరైనా నవగురువార వ్రతాన్ని ఆచరించొచ్చు

సంపూర్ణ భక్తివిశ్వాసాలతో, ఆత్మవిశ్వాసంతో ఆచరిస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు

గురువారం రోజు ప్రారంభించి అలా తొమ్మిది గురువాలు వ్రతాన్ని ఆచరించాలి

ఉదయం, సాయంత్రం ఏ సమయంలో పూజ చేసుకున్నా పర్వాలేదు

ఈ పీట లేదంటే పలక ఇంకేదైనా ఆసనం ఏర్పాటు చేసి దానిపై సాయిబాబా పటాన్ని ఉంచి..బొట్టు పెట్టి, పూలమాలలు వేసి అలంకరించాలి. భక్తిశ్రద్ధలతో పూజ చేసుకుని దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి.  

తొమ్మి వారాల వ్రతాన్ని ఆచరించే సమయంలో పాలు,పండ్లు తీసుకోవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పూట పాలు, పండ్లు తీసుకోవచ్చు

తొమ్మిది వారాలు సాయిబాబా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని రావాలి లేదంటే ఇంట్లోనే భక్తిశ్రధ్దలతో పూజ చేసుకోవాలి తొమ్మిది వారాల మధ్యలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా అక్కడ కూడా నవగురువార వ్రతాన్ని కొనసాగించవచ్చు...

మహిళలు నెలసరి వచ్చినా లేదంటే ఇంకేదైనా సమస్య వచ్చినా ఆ గురువారం వదిలేయవచ్చు..ఆ తర్వాత 9 గురువారాలు పూర్తిచేశామా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది 

'నవ గురువార' వ్రత కథ ఇది

కోకిల అనే స్త్రీ తన భర్త మహేష్ తో కలసి ఓ నగరంలో నివాసం ఉండేది. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగేది..కానీ మహేష్ ఎప్పుడు ఎలా ప్రవర్తించేవాడో అర్థంకాని పరిస్థితి. మాటలు, ప్రవర్తనతో కోకిత ఎంతో బాధపడేది. ఇరుగుపొరుగువారికి కూడా మహేష్ ప్రవర్తన నచ్చేది కాదు. శాంతస్వభావి అయిన కోకిల సహనంగా ఉంటూ కష్టాలు భరించేది. కాలక్రమంలో మహేష్ వ్యాపారం దెబ్బతినడంతో ఆ కోపాన్ని భార్యపై చూపించేవాడు మహేష్. ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయానికి ఓ సాధువు వచ్చి ఆ ఇంటి ముందు నిలిచాడు. బియ్యం, పప్పు స్వీకరించిన ఆ సాధువు..ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని దీవించారు. కోకిల ఎంతో బాధపడుతూ తన జీవితంలో సంతోషం అనేదే లేదని బాధపడి జరిగినదంతా చెప్పుకుంది. అప్పుడు ఆ సాధువు సూచించిన వ్రతమే నవగురువార వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో ఓ పూట మాత్రమే ఆహారాన్ని భుజించి సాయిబాబాను ప్రార్థించమని చెప్పారు. 9 వారాలు పూర్తైన తర్వాత పేదలకు అన్నదానం చేయమని చెప్పారు. కోకిల అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి తొమ్మిది వారాలు పూర్తిచేసి అన్నదానం చేసింది. గురువార వ్రత పుస్తకాలను అందరకీ పంచిపెట్టింది . అప్పటి నుంచి కోకిక కష్టాలు తీరి గృహంలో ప్రశాంతత నెలకొంది. భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది, వ్యాపారం వృద్ధి చెందింది. ఆ తర్వాత తన బంధువుల ఇంట్లో సమస్యలు తీరేందుకు కూడా ఈవ్రతాన్ని ఆచరించమని సూచించి వారిని సమస్యల నుంచి గట్టెక్కేలా చేసింది కోకిల. చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం ఇలా ప్రతి సమస్యకు నవగురువార వ్రతం పరిష్కారాన్ని ఇస్తుందని కథలో ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. అనుసరించే ముందు మీరు విశ్వసించే నిపుణులు, పండితుల సలహాలు స్వీకరించండి.