విశాఖ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం రెడీ అయింది. దేశంలోని అనేక నగరాల్లో వరుసగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తూ వస్తున్నా టీటీడీ విశాఖలోనూ ఆలయాన్ని నిర్మించింది. సాగర తీరాన్ని ఆనుకొని, రుషికొండ సమీపంలోని 10 ఎకరాల స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.  దీనికి దాదాపు రూ. 28 కోట్లు ఖర్చైంది.

 

ఇప్పటికే నిర్మాణం పూర్తైన దేవాలయంలో ప్రధాన దేవాలయం ఒకటిన్నర ఎకరం స్థలంలో నిర్మించారు. నిత్యం పూజలతోపాటు భక్తుల దర్శనం, ప్రసాదాల విక్రయ కేంద్రం వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయాన్ని మొత్తం రెండు అంతస్తులుగా నిర్మించారు. మొదటి అంతస్తులో మహాలక్ష్మి, గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఉంటారు. స్వామి వారికి ఇరువైపులా అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి . దిగువ అంతస్తులో ధ్యాన మందిరం, కల్యాణోత్సవ మండపం ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించే చోట వారి పాదాలను చెక్కారు . 

 

2019లో ప్రారంభమైన నిర్మాణం 

 

ఉత్తరాంధ్ర వైకుంఠంగా విశాఖలో ఒక వెంకటేశ్వర క్షేత్రం ఉండాలనే ఉద్దేశ్యంతో టీటీడీ 2019లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది . అయితే మధ్యలో కోవిడ్ కారణంగా నిర్మాణం కాస్త లేటైంది. మొత్తం 10 ఎకరాల్లో నిర్మించిన ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయం 1. 5 ఎకరాల్లో నిర్మితమైంది. మిగిలిన స్థలంలో పార్కింగ్, కొండపైకి మార్గం, చుట్టూ ప్రహరీ లాంటివి నిర్మించారు. ఇక్కడ 40 అడుగులతో ధ్వజ స్తంభాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడి శ్రీనివాసుని విగ్రహం 7 ఆడుగుల ఎత్తులో ఉంటుంది. 

 

ఈ నెల 18 నుంచి 23 వరకూ మహా సంప్రోక్షణ 

 

ఈ ఆలయ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ సీఎం బిజీగా ఉండడం, సరైన ముహూర్తం కుదరకపోవడం వంటి అడ్డంకులతో ఈ ఆలయ ప్రారంభోత్సవం చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనను సంప్రదాయబద్దంగా ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు టీడీడీ పాలనా సిబ్బంది, వేద పండితులు. ఈ నేపథ్యంలో 18 నుంచి ఆలయ ప్రతిష్టకు అంకురార్పణ పడనుంది. 18న వేదారంభం, 19న యాగశాల రక్షా బంధనం, కలశ స్థాపన, 20న హోమాలు, 21న జలాధివాసం, 22న నవకలశ స్నాపనం, బింబ వాస్తు, 23న ప్రధాన దేవతామూర్తులను ఆలయంలోనికి శాస్త్రబద్ధంగా చేర్చడంతోపాటు మహా సంప్రోక్షణ జరగనుంది. ఆరోజు ఉదయం 5 గంటల నుంచి 10:30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. అదేరోజు సాయంత్రం 3 గంటల నుంచి కల్యాణోత్సవం జరగనుంది