Tirumal News : నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగే తిరుమల నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. స్వామివారిని కన్నులారా దర్శించుకునేందుకు గంటలు, రోజుల తరబడి భక్తులు వేచి చూస్తారు. స్వామిని దర్శించుకున్నతర్వాత భక్తిపూర్వకంగా కానుకగా సమర్పిస్తారు. నిత్యం కోట్ల రూపాయల హుండీ ఆదాయం శ్రీవారి సొంతం. నగదుతో పాటూ బంగారం, వెండి కానుకలు కూడా స్వామివారికి సమర్పించుకుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు తిరుమలేశుడికి మొక్కులు చెల్లించుకుంటారు.
అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు కానుకలు సమర్పించినట్టు శాసనాల్లో ఉంది. ఆ తర్వాత మైసూర్ మహారాజ వంశీయులు బంగారు నగలు ఇచ్చారు. ఆ తర్వాత నందమూరి తారకరామారావు హయాంలో ప్రభుత్వం తరపున స్వామివారికి వజ్రకిరీటం చేయించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కేసీఆర్ 5 కోట్ల 2 లక్షల విలువైన పసిడి, గాలిజనార్థన్ రెడ్డి 42 కోట్లు విలువైన వజ్ర కిరీటం సమర్పించారు. ఇంకా శ్రీవారి ట్రస్టులకు కోట్లకు కోట్లకు విరాళాలు అందుతూనే ఉంటాయ్. అయితే ఈ మధ్యే ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారం స్వామికి అందించారు. దీని విలువ దాదాపు 140 కోట్లు. ఆధునిక చరిత్రలో ఇది నిజంగా చెప్పుకోదగిన విశేషం, విషయం కూడా. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం అనౌన్స్ చేయడంలో సోషల్ మీడియాలో,మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ కోనేటిరాయుడి ఖజానాలో ఎంత బంగారం ఉందో తెలుసా?
టీటీడీ ఖజానాలో మొత్తం 10 వేల కిలోల పసిడి ఉంది..స్వామివారి అలంకరణ కోసం 1100 రకాల స్వర్ణాభరణాలు వినియోగిస్తారు. 376 వజ్ర వైఢూర్యాలకు సంబంధించిన నగలున్నాయి. ఇంకా స్వామివారికి భారీగా నగదు, బంగారం కానుకలు వస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని నిబంధనలు విధించిన టీటీడీ ముందస్తు అనుమతులతో నిబంధనల మేరకు మాత్రమే భారీ కానుకలు సమర్పించాలని చెప్పింది. ఆ తర్వాత నుంచి హుండీ ఆదాయం మరింత పెరిగింది. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే బంగారం కాకుండా ఇతర ఆభరణాలను, బంగారు కానుకలను 15 ఏళ్ల క్రితం వరకూ మింట్ ద్వారా కరిగించి భక్తులకు విక్రయించేవారు, ఆ తర్వాత నుంచి బ్యాంక్ లో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. ఫస్ట్ టైమ్ 2010 మే నెలలో 1075 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు.. 2022 సెప్టెంబరు నాటికి ఈ లెక్క 10 వేల 258 కేజీలకు చేరింది.
ఇంతకీ తిరుమలేశుడికి భారీగా బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తుడు ఎవరన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తికర అంశం. స్వామిని నమ్ముకున్న ఓ భక్తుడు కంపెనీ పెట్టారు, అది ఊహించని లాభాలు అందించింది. కంపెనీలో 60 శాతం విక్రయిస్తేనే ఏకంగా ఏడువేల కోట్లు వచ్చాయట. ఇదంతా కలియుగదైవం అనుగ్రహమే అని భావించి అందులో కొంత మొత్తాన్ని స్వామివారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ౧౨౧ కేజీల బంగారం కానుకగా ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. వేంకటేశ్వరస్వామికి నిత్యం 120 కిటోల ఆభరణాలు అలంకరిస్తారు..అంతకన్నా ఒక్క కిలో అయినా ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ భక్తుడు అందించడం విశేషం. ఆ అజ్ఞాత భక్తుడు ఎవరన్నది తెలిసే అవకాశం లేనట్టే మరి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే! తిరమలలో మొత్తం సేవల వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి