కర్మానుసారం న్యాయంగా మనకు చెందాల్సిన సుఖదు:ఖాలను మనకు అందించే దేవుడు శని. ఆయన కోపం అష్టకష్టాల పాలు చేస్తుంది. ఆయన మన వైపే ఉండాలంటే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి.
శని న్యాయదేవత. జీవితంలోని అడ్డంకులు తొలగించమని అంతా భయభక్తులతో కొలుచుకుంటారు. శని దేవుడు సూర్య పుత్రుడు. శని కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. సూర్య పుత్రుడైన మరో దేవత యమధర్మరాజు. యముడు మృత్యుదేవత. మరణానంతరం వారి సద్గతులను నిర్ణయిస్తాడు. శనిని ప్రసన్నం చేసుకున్న వారు తమ లక్ష్యాలను ఛేదిస్తారని నమ్మకం. శని కరుణ పొందాలంటే కొన్ని పనులు తప్పక చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పనులు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడితే మరికొన్ని పనులు చెయ్యడం వల్ల శనికి కోపం రావచ్చు. తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేసి శని ఆగ్రహానికి గురికావద్దు.
పొరపాటున కూడా ఈ పనులు చెయ్యొద్దు
- బాత్ రూములు మురికిగా పెట్టుకోవద్దు. కాస్త మురికిగా అయినా సరే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే శని ఆగ్రహానికి గురికావల్సి రావచ్చు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మురికిగా వదిలెయ్యడం కూడా అసలు చెయ్యకూడదు.
- పెద్దవారిని, నిస్సహాయులను ఎప్పుడూ అవమానించకూడదు. అగౌరవ పరచకూడదు. ఇలా చేస్తే శని వేసే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
- చేసిన అప్పు ఉద్దేశ్య పూర్వకంగా తీర్చకపోతే మీరు శని కోపానికి గురికావల్సి వస్తుంది. రుణం తీసుకున్న వారు వీలైనంత త్వరగా దాన్ని తీర్చుకోవడం మంచిది.
- పాదాలు ఈడుస్తూ నడవడం అసలు మంచిది కాదు. ఇలా నడిచే వారిని శని అసలు వదిలిపెట్టడు. ఇలా చేస్తే తప్పనిసరిగా పూర్తవుతాయని అనిపించే పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. రకరకాలుగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతాయి.
- కుర్చిలో కూర్చుని పాదాలు ఊపే అలవాటు కూడా మంచిది కాదు. ఇలా కూర్చుని అవసరం లేకుండా పాదాలు కదిపే అలవాటు అసలు మంచిది కాదు. ఈ చర్య జీవితాన్ని ఉద్రిక్త పరిచేందుకు కారణం అవుతుంది.
- వంట గదిలో ఎంగిలి పాత్రలు వదిలెయ్యడం అంత మంచిది కాదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. లేదంటే వాటిని కడిగేందుకు బయట పెట్టుకోవాలి. ఎంగిలి పాత్రలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే సరిచేసుకోవడం అవసరం.
శని అనుగ్రహం కోసం
- నల్లని బట్టలు, ఆవాలు, నూనె దానం చెయ్యడం, అవసరమైన వారికి వారి అవసరాన్ని అనుసరించి ప్రేమగా, స్వచ్ఛందంగా దానం చెయ్యడం వల్ల రుణ కర్మలను కొంత వరకు తీర్చుకోవచ్చు.
- ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం, ఇంట్లో వండిన దాన్ని ఆకలిగా ఇంటికి వచ్చిన వారికి ప్రేమగా వడ్డించడం.
- అందరినీ గౌరవంగా చూడడం, ఆఫీసులో లేదా మీదగ్గర పనిచేసే వారిని చులకన చెయ్యకుండా అవమాన పరచకుండా గౌరవంగా చూసుకోవడం.
- కాకి శనికి వాహనం కనుక కాకులకు ఆహారం, నీళ్లు అందించడం. శనివారం రోజున కాకులకు ఆహారం అందిస్తే విశేష ఫలితాలను ఉంటాయి.
- క్రమశిక్షణతో ఉండడం. పూర్తి చెయ్యాల్సిన పనులను జాబితా ప్రకారం సకాలంలో పూర్తిచెయ్యడం, సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, వ్యాయామం చెయ్యడం ఇలాంటి క్రమశిక్షణ కలిగిన జీవన శైలి జీవితంలో శని అనుగ్రహాన్ని ఇస్తుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read : బన్నీతో ఫోటో మాత్రమే, 'పుష్ప 2'లో సీరత్ ఐటమ్ లేదు!