తాంబులం పెట్టెలోనో, మసాలా దినుసుల డబ్బాలోనో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే లవంగంతో చాలా పరిహారాలు చేసుకోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. క్షుద్ర పూజల్లోనూ దీన్ని వినియోగిస్తారట. లవంగాలను పూజల్లోనూ, పితృదేవతారధనలోనూ వినియోగిస్తారు. లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. జ్యోతిషంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాల ప్రస్థావన ఉంది. చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే లవంగాలతో చేసుకునే ఈ చిన్న సులభతరమైన పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయట. అవేమిటో తెలుసుకుందాం. 



  • కొన్ని సార్లు ఏ పనిచేపట్టినా ఎదో ఒక ఆటంకం కలుగుతుంది. పనులు పూర్తికావడంలో జాప్యం జరుగుతుంది.  ఈ జాప్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో  దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి హారతి చెయ్యాలి. ఇలా చేస్తే త్వరలోనే పనులలో విజయం సాధించడం మొదలు పెడతారు.

  • ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నపుడు నోట్లో రెండు లవంగాలు వేసుకుని వెళ్లాలి. వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాల్లోని చిన్న ముక్కను అక్కడ విసిరేయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీరు వెళ్లినపని విజయవంతంగా పూర్తవుతుంది.

  • ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే, అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీతో పాటు రెండు లవంగాలు సమర్పించాలి. 5 లవంగాలను, 5 రూపాయి బిల్లలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆమూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది. అంతే కాదు ధనధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా, నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి.

  • కొంత మందికి జాతకంలో దోషం ఉండడం వల్ల పనులు కాకపోవడం, ఆర్థిక కష్టాలు, అపజయాలు వెంటాడుతుంటాయి. జాతకంలో రాహు-కేతు దోషం ఉంటే ప్రతి శనివారం లవంగాలు దానం చెయ్యాలి. అంతేకాదు శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చెయ్యడం వల్ల రాహు కేతువుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది.

  • ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనార్యగ్యం పాలవుతుంటారు. ఇలాంటపుడు 5 లవంగాలు తీసుకుని వారి మీదుగా కింద నుంచి పైకి , పై నుంచి కిందకి వాటిని 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కాల్చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు.


Also read : ఇంట్లో ఈ దిక్కున పితృదేవతలుంటారు: వాస్తు ప్రకారం పాటించాల్సిన జాగ్రత్తలు


 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.