Kokilavan Shani Temple: హిందూమతవిశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. ఎవరైనా తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. ఎవరి జాతకంలో అయితే శని దేవుడి స్థానం బలంగా ఉంటుందో.. శని దేవుడి దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు కచ్చితంగా త్వరలో ధనవంతులుగా మారుతుంటారు. అదేవిధంగా శనిదేవుడి దృష్టి ప్రతికూలంగా ఉంటే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. అంతేకాదు జీవితంలో అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరమైన రంగాల్లో నష్టాలను చూడాల్సి ఉంటుంది.


ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సాడేసతి, శనిదోషాలను ఎదుర్కొవల్సి వస్తుందని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. అయితే శని దేవుడి ఆశీస్సులను పొందేందుకు శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజు శనిదేవాలయాలకు వెళితే మంచి ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనిదేవుడి ఆలయంలో ఆవాల నూనె, నల్ల, నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.


శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కోకిలవన్ శనిదేవ్ దేవాలయానికి వెళ్లాలి. కోకిలవన్ ధామ్ ఉత్తరప్రదేశ్ లోని మథురలోని కోసి కలాన్ లో ఉంది. ఈ దేవాలయాన్ని బాబా బర్ఖండికి అకింతం చేశారు. దట్టమైన అడవుల్లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం బర్సానాకు సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో శ్రీక్రిష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు.అద్భుతమైన ఈ దేవాలయం గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. 


కోకిలవన్ శని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు:


బ్రిజ్మండల్ లో జన్మించిన శ్రీకృష్ణుడిని దేవతలందరూ అభినందించారు. ఈ దేవతల్లో శనిదేవుడు కూడా ఉన్నారు. అయితే కృష్ణుడి తల్లి యశోద శనిదేవుడిని చూడకుండా అడ్డుకుంటుంది. శనిదేవుడి వక్రదృష్టితో శ్రీకృష్ణుడిపై పడుతుందేమోనని యశోద ఆందోళనపడుతుంది. యశోద ప్రవర్తనతో నిరాశ చెందిన శనిదేవుడు కృష్ణుడిని శాంతింపజేయడానికి ద్వాపరయుగంలో కఠోర తపస్సు చేశారు.


శనిదేవుడి తపస్సుకు సంతోషించిన కృష్ణుడు కోకిల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నందగావ్ పక్కనే ఉన్న కోకిల వనమే తన వనమని కృష్ణుడు చెప్పాడు. కోకిలవనంకు వచ్చిన శనిదేవుడిని మొక్కుకునే ప్రతిఒక్కరికి శనిదేవుడితోపాటు కృష్ణుడు అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడు చెబుతాడు. ఈ కారణంగా కోకిలవనం శనిదేవుడి ఆలయంగా ప్రస్దిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. కోకిల ధామ్ లోని ప్రసిద్ధ దేవాలయంలో శనిదేవుడు, గోకులేశ్వర్ మహదేవ్, గిరిరాజ్, బాబా బాంఖండి, దేవ్ బిహారీలు కొలువుదీరి ఉన్నారు. 


ఈ కోకిలవన్ కు వచ్చిన మొక్కిన భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది భావిస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలనే ఆశతో, శనివారం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచంలో పలు దేశాల నుంచి వందలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. కృష్ణుడి ఆశీస్సుల కోసం వేలాది మంది యాత్రికులు మధురకు వెళ్తుంటారు.


అంతేకాదు కోకిలవన్ ధామ్ దగ్గర 1.25 కిలోమీటర్ల మేర ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత భక్తులు సూర్య కుండ్ లో స్నానమాచరించి ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఆవాల నూనెను సమర్పిస్తే శనిదోషం తొలగిపోతుందని నమ్ముతుంటారు. కేవలం తైలం సమర్పించిన కూడా కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనెను నైవేద్యంగా  సమర్పిస్తే కోరిక కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 


Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.