Holy Leaves In Hinduism: హిందూ ధ‌ర్మంలో చెట్లు, మొక్కలు మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ఆకులు, కాండం, పండ్లు, విత్తనాలు, వేర్లు కూడా చాలా పవిత్రమైనవి భావిస్తారు. దేవతలను ఆరాధించడం నుంచి అన్ని శుభకార్యాలలో వివిధ రకాల ఆకులను ఉపయోగించటానికి ఆ ఆకుల పవిత్రతే కారణం. మతపరంగానే కాకుండా శాస్త్రంలో కూడా ఆకుల ప్రాధాన్యతను పేర్కొనడం గమనార్హం. పూజలో మనం ఏ ఆకులను ఉపయోగిస్తే శ్రేయస్కరం..? ఏ ఆకులను ఉపయోగిస్తే మన కోరికలు నెరవేరుతాయి..? వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.


Also Read : నైవేద్యం ఇలా సమర్పించండి, పూజ తప్పక ఫలిస్తుంది


మామిడి ఆకు
హిందూమతంలో, ఏదైనా శుభకార్యానికి మామిడి ఆకులతో తోర‌ణాలు తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తారు. దీని ఆకులను పూజలో కలశం పైభాగంలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. హిందూ ధ‌ర్మం ప్రకారం, ప్రతికూలతను తొలగించడం ద్వారా సానుకూలతను వ్యాప్తి చేసే శక్తి మామిడి ఆకులకు ఉంది. అందువ‌ల్లే మంగళ కార్య‌క్ర‌మాల్లో వీటిని ఉపయోగిస్తారు. మామిడి ఆకులోని శుభశక్తి ఆ శుభ కార్యంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ ఉపశమనాన్ని ఇస్తుందని నమ్ముతారు.


తులసి ఆకు
పురాతన సంప్రదాయంలో, తులసి ఆకులను తరచుగా పూజలో ఉపయోగిస్తారు. వైష్ణవ‌ ఆరాధనలో, అంటే విష్ణువును ఆరాధించేవారికి, ప్రత్యేకంగా విష్ణువుకు నైవేద్యాలు సమర్పించడానికి తుల‌సిని ఉపయోగిస్తారు. తులసిని విష్ణు ప్రియ అని అంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో దుఃఖం, దురదృష్టాలు ఉండవని నమ్మకం. హిందూ మతంలో, ఇల్లు లేదా స్థలాన్ని శుద్ధి చేయడానికి తులసిని నీటిలో క‌లిపి చల్లుతారు.


తమలపాకు
సనాతన‌ సంప్రదాయంలో, తమలపాకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ కారణంగానే దీనిని దేవతామూర్తుల పూజలలో ప్రత్యేకంగా సమర్పిస్తారు. సనాతన సంప్రదాయంలో, ఇది అంగారకుడి చిహ్నంగా భావిస్తారు. తమలపాకులను పూజలో మాత్రమే కాకుండా జ్యోతిష్య పరిహారాలకు కూడా ఉపయోగిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తమలపాకు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది.


మారేడు ఆకు (బిల్వ ప‌త్రం)
మారేడు (బిల్వ‌) మొక్క, దాని ఆకులు ప‌ర‌మేశ్వ‌రుడికి అత్యంత ప్రీతిక‌ర‌మైన‌వి. అందుకే బిల్వ ప‌త్రాన్ని హిందూ సంప్ర‌దాయంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మారేడు పండు లేదా పత్రం రూపంలో ప‌ర‌మ‌ శివునికి సమర్పిస్తారు. దీని ద్వారా మీకు త్వరగా శంక‌ర‌ అనుగ్రహం లభిస్తుంది.


జ‌మ్మి (శ‌మీ) ఆకు
బిల్వ ప‌త్రాల్లాగే శమీ ప‌త్రాల‌ను కూడా శివునికి సమర్పిస్తారు. హిందువుల విశ్వాసం ప్రకారం, బిల్వ ఆకులను సమర్పించడం కంటే శంకరునికి శమీ (జ‌మ్మి ఆకులను) ప‌త్రాల‌ను సమర్పించడం వల్ల చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. శివునితో పాటు, ఆయ‌న‌ కుమారుడైన గణ‌ప‌తికి, శనికి కూడా శ‌మీ ప‌త్రాన్ని సమర్పిస్తారు.


అరటి ఆకు
పురాతన సంప్రదాయంలో, అరటి మొక్క శ్రీ విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే అరటి ఆకులను విష్ణుమూర్తి పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దక్షిణ భారతదేశంలో, ఈ ఆకును చాలా పవిత్రంగా భావిస్తారు. అర‌టి ఆకులో భ‌గ‌వంతునికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, అర‌టి మొక్కను పూజించడం ద్వారా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.


Also Read : మధ్యాహ్నం పూజ ఎందుకు చేయకూడదు?


జిల్లేడు ఆకు
జిల్లేడు ఆకును శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. జిల్లేడు ఆకుపై ఓం అని రాసి శివలింగానికి సమర్పిస్తే, పరమేశ్వరుడి ఆశీస్సులు త్వరలోనే లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.