Sri Viswavasu Nama Samvatsara Ugadi 2025: క్రోధి నామ సంవత్సరం ముగిసింది..శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుుపెట్టాం. ఈ రోజు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి తయారు చేసి భగవంతుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. మరి ఏ సమయంలో ప్రసాదాన్ని దేవుడికి పెట్టాలి, ఎప్పుడు తినాలి? ఇదిగో వివరాలు..
2025 మార్చి 30 ఆదివారం సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది.
మార్చి 30 ఆదివారంవర్జ్యం ఉదయం 7.31 నుంచి 9.02 వరకూ ఉంది
మార్చి 30 ఆదివారం దుర్ముహూర్తం సాయంత్రం 4.32 నుంచి 5.21 వరకూ ఉంది
మార్చి 30 ఆదివారంఅమృత ఘడియలు సాయంత్రం 4.28 నుంచి 5.57 వరకు
పాడ్యమి తిథి మధ్యాహ్నం 2.46 వరకే ఉంది కాబట్టి..ఈలోగానే ఉగాది పచ్చడి దేవుడికి నివేదించాలి
వర్జ్యం , దుర్ముహూర్తం లేని సమయం చూసి పూజ చేసుకుని ఉగాది పచ్చడి తినాలి. అంటే ఉదయం ఏడున్నర లోపు .. లేదంటే 9.02 తర్వాత ఉగాది పచ్చడి తినాలి.
‘శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ। సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణమ్।।’
ఈ శ్లోకం చెప్పి ఉగాది పచ్చడి తినాలని చెబుతోంది శాస్త్రం. షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి వల్ల శరీరానికి బలం. ఆరోగ్యం , ఆయుష్షు , బలం ఇస్తుంది. వసంత రుతువు ఆగమనంతో మొదలయ్యే ఉగాదిని పచ్చడితో ఆరంభించడానికి ఏ ప్రత్యేక కారణం ఉంది. వసంతంలో చెట్లు చిగురిస్తాయి. వాతావరణంలో మార్పుల ప్రభావం మనపై ఉంటుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయ్..ఈ సమయంలో ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. అందుకే ఉగాది రోజు తినే పచ్చడితో ఆ మార్పులు మొదలవుతాయి. ఔషధ గుణాలు కలిగిన మామిడి, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు కలపి తయారు చేసే ఈ పచ్చడి ఆరు రకాలైన వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. అదే సమయంలో కొత్త ఏడాదిలో ఎదురయ్యే తీపి-చేదు అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది.
మామిడి కాయలో ఉండే వగరు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, వడదెబ్బ రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడంతో పాటూ చర్మంలో మెరుపు పెంచుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి పొట్టలో పేరుకుపోయిన అపాన వాయువులను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సీజనల్ వ్యాధులబారినపడకుండా కాపాడుతుంది
జీవితంలో ఆనందం నిండి ఉండాలనేందుకు సూచనగా ఉగాది పచ్చడిలో బెల్లం కలుపుతారు. కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి..వాటిని ఎదుర్కొంటూ , దాటుకుంటూ తీపివైపు అడుగువేయాలన్నదే ఆంతర్యం. బెల్లం ఆనందం, సంతోషం అని అతిగా వేసుకోకూడదు.మితంగా వేసుకోవాలి.బెల్లంలో ఉండే సహజగుణం మనసుని ఆహ్లాదపరుస్తుంది. శరీరానికి అవసరం అయిన విటమిన్లూ, ఖనిజాలూ అందిస్తుంది
ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు.. జీవితంలో ఎదురయ్యే బాధల్ని జ్ఞాపకాలుగా మిగులుస్తాయి. కష్టపడకుండా ఏమీ సాధించలేవు, గత అనుభవాలతో అడుగు ముందుకు వేయి అని చెప్పడమే చేదు వెనుకున్న ఆంతర్యం
ఉగాది పచ్చడిలో ముందుగా తలిగే రుచి పులుపు. ఇందుకోసం ప్రత్యేకించి చైత్రంలో వచ్చే కొత్త చింతపండునే తీసుకుంటారు. రాబోయే రోజుల్లో జాగ్రత్తసుమా అన్నదే ఈ పుల్లటి రుచి వెనుకున్న ఆంతర్యం. ఆరోగ్యపరంగా చూస్తే వాతాన్ని పోగొట్టే గుణం పులుపులో ఉంటుంది.
ఉగాది పచ్చడిలో కొందరు కారం వేస్తే మరికొందరు పచ్చిమిర్చి వేస్తుంటారు. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని తట్టుకుని నిలబడాలన్న సూచన ఇది.
ఉగాది పచ్చడిలో ఆరో రుచి ఉప్పు. ఉప్పు ఉత్సాహానికి సూచన. అస్సలు లేకపోతే బావోదు..అతిగా వేస్తే తినడానికి పనికిరాదు. జీవితంలో అయినా అంతే..అంతా సరిసమానంగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో తేమను నిలిపిఉంచుతుంది