శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో జరిగే మన రామానుజ తిరునక్షత్ర మహోత్సవంలో విశేష కైంకర్యాలు నిర్వహించనున్నారు. వెయ్యేళ్ళ క్రితమే సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి అవతరించి 1005 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.  మే5 గురువారం నుంచి మే 9 సోమవారం వరకూ ఐదు రోజుల పాటూ జయంతోత్సవాలు నిర్వహించనున్నారు. 


Also Read: చోళరాజుల కంటపడకుండా రామానుజాచార్యులు తిరుపతికి తరలించిన గోవిందరాజస్వామి విగ్రహం ఏమైంది.. ఇప్పుడు ఎక్కడుంది..


వేదానికి సరైన అర్ధం చెప్పిన వ్యక్తి, అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త, భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. వేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి... రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తిమార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది ఆయనే. భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు. అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు. 


Also Read:  ఎవరీ రామానుజులు, ఆయన ఏం చెప్పారు, సమాజం-సమానత్వం కోసం ఏం చేశారు..


సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు.


Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...


రామానుజులపై అన్నమయ్య కీర్తన
సంపుటం: 2-372


గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ॥పల్లవి॥





యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-




మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము ॥గతు॥


వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము ॥గతు॥


నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము ॥గతు॥