సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడు ఆమెని లంకలో అశోకవనంలో ఉంచాడని రామాయణంలో చెప్పుకుంటాం.ఆ సమయంలో సీతాదేవి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంటుంది. రావణుడి ఆజ్ఞానుసారం, రాక్షస స్త్రీలు, సీత దగ్గరకు చేరి కఠినమైన మాటలతో బాధపెట్టారు. ఏకజట, హరి జట, ప్రఘస, వికట, దుర్ముఖి, వినత, అసుర, చండోదరి, అజాముఖి, శూర్ఫణక అనే రాక్షస స్త్రీలు రావణుడి బలపరాక్ర మాలను పొగిడి అతడి ఇల్లాలివై సంతోషించమనీ, రారాజును, దేవ తల విరోధిని, రావణుడిని భర్తగా చేసుకుని సుఖపడమని హితబోధ చేశారు. కఠినమైన మాటలతో తనను బాధపెడుతున్న రాక్షసస్త్రీలకు సీతాదేవి తనోమనోగతం వివరించింది. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన త్రిజట.. రాక్షస స్త్రీలను హెచ్చరిస్తూ సీతాదేవికి ధైర్యం చెబుతూ తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందని చెప్పి తనకు వచ్చిన కలగురించి వివరించింది.
 
త్రిజటకు వచ్చిన కల ఇదే
శ్రీరామ చంద్రుడు నాలుగు దంతాలున్న ఏనుగుని ఎక్కి ఆకాశపు దారుల వెంట వచ్చాడు. వేల వేల సూర్యుల్లా వెలిగిపోతూ శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లిని చేయిపట్టి ఏనుగుపైకి ఎక్కించుకుని మరీ తీసుకువెళ్లాడు. మరి లంకేమయిందని అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు అడిగారు. దానికి సమాధానంగా త్రిజట ఇలా చెప్పింది. సర్వనాశనం అయిపోయింది. సముద్రంలో కలిసిపోయింది. రావణ కుంభకర్ణులు దిగంబరులై మురికి గుంటలో పడిపోయారు. మృత్యుదేవతేమో… వికృతమైన స్త్రీ రూపంలో ఎర్రని గుడ్డలు కట్టుకుని రావణాదుల మెడకు తాడు బిగించి దక్షిణ దిశగా లాక్కుపోతోంది. రాక్షసులంతా శవాలయ్యారు. మన జాతి మొత్తం నాశనమయిందని చెప్పింది త్రిజట.


Also Read: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే


త్రిజట మాటలు వినగానే సీతాదేవికి ఎడమకన్ను అదిరింది. వెంటనే ఎడమ భుజం, ఎడమ తొడ అదిరింది. అంటే రాముడు సమీపంలోనే ఉన్నాడని సూచిక అన్నమాట. చెట్లపై ఉన్న పక్షులు సంతోషంతో కిలకిలరావాలు చేశాయి, అంతా మంచే జరగబోతున్నట్టు వాయువు సందేశం ఇచ్చాడు. మరోవైపు త్రిజట మాటలు విని ఏం చేయాలో దిక్కుతోచక చూశారు రాక్షస స్త్రీలు. ఆ సమయంలో స్పందించిన త్రిజట... సీతమ్మను వేడుకుంటే మనకు అభయమిచ్చి కాపాడుతుందని చెప్పడంతో అంతా సీతాదేవిని వేడుకుంటారు. ఆ భయంలో సీతాదేవి ఇచ్చిన ఊరటలో ఎక్కడివారక్కడ అలసిపోయి నిద్రపోయారు.అప్పటి వరకూ జరిగినదంతా చూసిన చెట్టుపైఉన్న హనుమంతుడు ఆమె సీతాదేవిగా కన్ఫామ్ చేసుకుని కిందకు వచ్చి సీతాదేవితో మాట్లాడగలుగుతాడు. 
 


Also Read:  ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే


త్రిజటను విభీషణుడి కూతురని కొందరు, కాదని మరికొందరు అంటారు. ఆమె సీతాపక్షపాతి అనే ప్రస్తావన ఉంది. ఇక స్వప్నాల విషయానికొస్తే రామాయణంలో మూడు స్వప్నాలున్నాయి. దశరథ స్వప్నం, భరత స్వప్నం, త్రిజట స్వప్నం.  ఈ మూడూ నిజమయ్యాయి.