ఇంటి సింహ ద్వారాన్ని  16 విధాలుగా నిర్మించొచ్చు. దీన్నే షోడశ గృహనిర్మాణం అంటారు. అవేంటి..సింహద్వారం ఎటువైపు నిర్మిస్తే ఎలాంటి ఫలితమో తెలుసుకోండి...


ఇటు వైపు సింహద్వారం శుభం


ధృవగృహం: నాలుగు దిక్కులా గోడలు నిర్మించి..పై వైపు ద్వారం నిర్మాణం చేయడాన్ని ధృవ గృహం అంటారు. అంటే నేలమాళిగకు ఉండేద్వారం అన్నమాట.


ధాన్య గృహం: తూర్పు వైపు మాత్రమే సింహద్వారం కలిగిన గృహాన్ని ధాన్య గృహం అంటారు. ఇలాంటి ఇల్లు శత్రునాశనం చేసి విజయాన్నందిస్తుంది. 


జయగృహం: దక్షిణం వైపు మాత్రమే సింహద్వారం ఉంటే జయగృహం అంటారు. ఇది కూడా శత్రువలపై పై చేయి సాధించేలా చేస్తుంది. వ్యాపారాలకు ఈ ద్వారం అత్యంత అనుకూలం.


కాంత గృహం: తూర్పు, పశ్చిమాన ద్వారాలు ఉన్న ఇంటిని కాంత గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో ధనలాభం, వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ది, ఆరోగ్యం, సంతోషం కొలువై ఉంటాయంటారు వాస్తు పండితులు. 


మనోరమ గృహం: దక్షిణం, పడమర వైపు ద్వారాలుండే ఇంటిని మనోరమ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో మానసిక ఆనందం, సిరి సంపదలు, వంశాభివృద్ధి ఉంటుంది. 
 
ధన గృహం: తూర్పు, ఉత్తర, దక్షిణ ద్వారాలు కలిగిన ఇంటిని ధన గృహం అంటారు. ఇలా ఉంటే అష్ట ఐశ్వర్యాలు, పశు సంపద, యశోకీర్తి, కుటుంబ వృద్ధి, రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది.


విపుల గృహం: ఉత్తరం, పడమర, దక్షిణ దిశల్లో ద్వారాలుంటే విపుల గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో ఉంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది, దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. 


జయగృహం: నాలుగు వైపులా ద్వారాలు ఉన్న ఇంటిని జయ గృహం అంటారు. వ్యవసాయ భూమితో పాటూ  ధన ధాన్య, పశు సంవృద్ధి ఉంటుంది.  ఆర్థికంగా బావుంటుంది. 


రాజకీయ నాయకులకు
సుముఖ గృహం: తూర్పు, పడమర, దక్షిణ దిశల్లో ద్వారాలుండే ఇంటిని సుముఖ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మానాలు అందుకుంటారు. రాజకీయ ఎదుగుదల ఉంటుంది . అయితే 25 ఏళ్ల తర్వాత కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది.


క్షయ గృహం: పడమర, ఉత్తర దిశల్లో ద్వారాలు కలిగిన ఇంట్లో సిరిసంపదలు నశిస్తాయి. ముఖ్యంగా  రాజకీయ నాయకులకు, వ్యాపారులకు ఈ ద్వారం అస్సలు కలసిరాదు. అనవసర తలనొప్పులు తప్ప ఇంకేమీ మిగలదు. 


ఇటువైపు ద్వారం అస్సలు ఉండకూడదు
నంద గృహం: తూర్పు, దక్షిణ దిశల్లో రెండువైపులా సింహద్వారాలు ఉన్న ఇంటిని నంద గృహం అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో మహిళలు నిత్యం అనారోగ్యంతో బాధపడతారు. శారీరక సుఖం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు


ఖరగృహం: పశ్చిమం వైపు సింహం ద్వారం ఉండే ఉంట్లో ఆర్థిక ఇబ్బందులు, బాధ తప్పదు. 


దుర్ముఖ గృహం: ఉత్తర దిశలో మాత్రమే ద్వారం ఉండే ఇల్లు కొందరికి మాత్రమే కలిసొస్తుంది. ఇలాంటి ఇంట్లో నిత్యం గొడవలు, సోదరుల మధ్య బంధం తెగిపోవడం జరుగుతాయి. ఆర్థికంగా ఎదుగుదల కనిపించినా రానురానూ తగ్గిపోతుంది. 


క్రూర గృహం: తూర్పు, ఉత్తర దిశల్లో ద్వారం ఉన్న ఇంటిని క్రూర గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో అభివృద్ధి చెందుతారు కానీ... దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అపమృత్యు దోషం కూడా వెంటాడుతుందట.
 
అక్రంద గృహం: తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ద్వారం కలిగిన ఇంట్లో శోకం, నిత్య రోగాలు, బంధువులతో వివాదాలు వెంటాడుతాయి. 


ఈ దిక్కున సింహద్వారం ఉంటే మిశ్రమ ఫలితాలు
సూపక్ష శాల: ఉత్తరం, దక్షిణాల్లో ద్వారాలు ఉన్న ఇంటిని సూపక్ష శాల అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది. వంద సంవత్సరాల ఆయుష్షు కలిగిన గృహం. కానీ శత్రు భయం ఉంటుంది.


అయితే పైన చెప్పినవన్నీ కామన్ గా చెప్పే విషయాలు..మళ్లీ మీ నక్షత్రాన్ని బట్టి కూడా మీకు  ఏ వైపు సింహద్వారం ఉంటే మంచిదన్నది వాస్తు నిపుణులును సంప్రదించగలరు.   


వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.