సంతోషం, సమృద్ది, పురోగతి, విజయం ఇవి అనుబంధాలకు మరింత మాధుర్యాన్ని అద్దుతాయి. జీవితాన్నిఅర్థవంతం చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఇవన్నీ ఉండాలని తపిస్తుంటారు. జీవితంలో ఏది ఎప్పుడు జరగాలనేదానికి కచ్చితంగా ఒక సమయం ఉంటుంది. అలా ముందుగానే నిర్ణయించి ఉంటుందని నమ్మకం. మంచి సమయం రాబోతుందని తెలియజేసే సూచనలు ముందుగానే కనిపిస్తాయి.  ఈసూచనలను గ్రహించడం వాటికి అనుగుణంగా పరిస్థితులను చక్కదిద్దుకోవడం అవసరం. మరి ఎలాంటి సంకేతాలు ఎలాంటి సమయానికి సూచికలో తెలుసుకుందాం.


దేవుడికి సమర్పించిన పూవ్వులు


దైవ పూజకు, ఆరాధనకు తప్పకుండా పూవ్వులు వినియోగిస్తారు. అలా దేవుడకి సమర్పించిన పూలు అకస్మాత్తుగా మీ ముందుపడితే అది భగవదనుగ్రహంగా భావించాలి. త్వరలో మీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందనేందుకు సంకేతం.


చేతుల్లో దురద


ఒకవ్యక్తి అరచేతిలో దురదగా ఉంటే అది శుభసంకేతం. ఏదో జరిగి ఎక్కడి నుంచో మీకు డబ్బురాబోతోందనడానికి సంకేతంగా అరచేతిలో దురద వస్తుందట. పురుషులకు కుడి చేతిలో మహిళలకు ఎడమ చేతిలో ఇలా దురద వస్తే శుభసూచకంగా భావించాలి


స్వీపర్ ఊడవటం


ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నపుడు రోడ్డుమీద రోడ్డు శుభ్రం చేసే వ్యక్తులు కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావించాలి. చెయ్యాలనుకునే పని విజయవంతం అవుతుందని అర్థం.


పిల్లి పిల్లల పుట్టుక


పిల్లి ఏడుపు అసలు మంచిది కాదు. కానీ పిల్లి ఇంట్లో పిల్లలకు జన్మనిస్తే అది శుభసంకేతంగా భావించాలి. ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లలను పెడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ రాబోతోందని అర్థం. ఆ ఇంట్లోకి సిరిసంపదలు రాబోతున్నాయనడానికి సంకేతం.


పిచ్చుకల కిచకిచలు


పిచ్చుక మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే అది చాలా మంచి సమయానికి ప్రతీక. లేదా పిచ్చుకలు మీ ఇంటి ప్రాంగణంలో కిచకిచలాడితే శుభసూచకం. దీని వల్ల జీవితంలో మంచి రోజులు రోబోతున్నాయనేందుకు సంకేతం.


కలలో గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, నక్షత్రం, గులాబి వంటివి కనిపిస్తే సంపద పెరగడానికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్ధం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సూచన. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో చెరకు కనిపిస్తే కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు.


ఇంట్లో ఒకేచోట మూడు బల్లులు కనిపించడం కూడా మంచి శకునంగా భావిస్తారు.


ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం శుభసంకేతం. ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తీసుకువెళ్లడం కనిపిస్తే అది మంచి శకునం. త్వరలో పెద్ద మొత్తంలో డబ్బు లాభించబోతుందని ఈ శకునం చెబుతుంది.  


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.