Ramayana: రామాయణంలో వాలి సుగ్రీవుల గురించి తెలియని వారు ఉండరు. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వం చివరికి రాముడి చేతిలో వాలి చావుకు సీతాన్వేషణకు సుగ్రీవుడి సాయానికీ దారి తీశాయి. అంతేగాదు రాముడికి ఆంజనేయుడి తొలిపరిచయం కావడం కూడా సుగ్రీవుడి వల్లనే అని రామాయణం చెబుతోంది. అయితే అసలు ఈ వాలి సుగ్రీవుల తల్లి తండ్రులు ఎవరు వారి జన్మ వృత్తాంతం ఏంటి అనేది చాలామందికి తెలియదు. 


వాలి సుగ్రీవుల పుట్టిన వివరాలు రామాయణంలోని చివరి భాగమైన ఉత్తరకాండ (ఉత్తర రామాయణం )లో దొరుకుతుంది. రావణ సంహారం నుంచి తిరిగి వచ్చి అయోధ్యను శ్రీరాముడు పాలిస్తున్న సమయంలో ఆయన్ని కలవడానికి వచ్చిన అగస్త్య మహర్షిని వాలి సుగ్రీవుల జన్మవృత్తాతం గురించి రాముడు అడిగినప్పుడు ఆ మహర్షి చెప్పిన కథ ఇది. 


బ్రహ్మ కంటి నుంచి పుట్టిన వానరుడు స్త్రీగా ఎలా మారాడు? 
మేరు పర్వతం మీద బ్రహ్మ కొంతకాలం యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయన కంటి నుంచి ఒక చుక్క నీరు నేల మీద పడి ఒక వానరుడు పుట్టాడు. ఆ వానరుడు బ్రహ్మ వద్దనే ఉంటూ పగలు అంతా మేరు పర్వతం చుట్టుపక్కల ఉండే చెట్ల మీద తిరుగుతూ ఉండేవాడు. సాయంత్రం పూట మాత్రం బ్రహ్మ వద్దకు పూలు, పళ్లూ పట్టుకుని వచ్చి ఆయన్ను గౌరవించి వెళుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఆ వానరుడు మేరు పర్వతం అవతల ఉన్న ఒక చిత్రమైన సరస్సు చూశాడు. దాని ఒడ్డుకు వెళ్లి తొంగి చూసినప్పుడు తన ప్రతిబింబం దానిలో కనపడడంతో దాన్ని మరో వానరుడిగా భ్రమించి పట్టుకోవడానికి సరస్సులో దూకాడు. 


అలా దూకిన వానరుడు నీటిలో తనలా ఉన్న వ్యక్తి కోసం వెదికి వెదికి అలసిపోతాడు. ఎవరూ దొరకకపోవడంతో అలిసిపోయి ఒడ్డుకు చేరుకోగానే ఆ వానరుడు కాస్తా అందమైన అమాయిగా మారిపోయాడు. తన ఆకారాన్ని చూసుకొని భయపడి వానరుడు... బ్రహ్మ వద్దకు వెళ్లాడు. ఆ సరస్సు శాపగ్రస్తమైనదని తనకు పిల్లలు పుట్టగానే తిరిగి మగ రూపం వస్తుందని బ్రహ్మ చెప్తాడు. 
చేసేది లేక దిగాలుగా అదే సరస్సు ఒడ్డున కూర్చుని ఉంటాడు. ఒకరోజు బ్రహ్మను చూసి వెళ్తున్న ఇంద్రుడు, సూర్యుడు అలా కూర్చొని ఉన్న అమ్మాయి రూపంలో ఉన్న వానరుడిని చూస్తారు. మనసు పడతారు. దీంతో  వారిద్దరి వల్ల అమ్మాయి రూపంలో ఉన్న వానరుడు ఇద్దరు పిల్లల్ని కంటాడు. వారే వాలి సుగ్రీవులు.


ఆ ఇద్దరిలో వాలికి ఇంద్రుడు బంగారు తామరపూలతో కూడిన సురపుష్ప మాలను కానుకగా ఇచ్చాడు. దీనిని మెడలో వేసుకుంటే వాలితో ఎదురుగా ఉండి పోరాడే వారి శక్తిలో సగభాగం వాలికి వచ్చేస్తుంది. సుగ్రీవుడు ఈ రహస్యాన్ని రాముడికి చెప్పడం వల్లనే తరువాతి కాలంలో చెట్టుచాటు నుంటి బాణం ప్రయోగించి వాలిని చంపగలిగాడు శ్రీ రాముడు. 


సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి మిత్రుడు వాయుదేవుడి కొడుకైన హనుమంతుడుతో స్నేహాన్ని ఏర్పరిచాడు. ఇలా ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఆ అమ్మాయి మళ్ళీ వానరుడిగా మారిపోయింది. విషయం తెలుసుకున్న బ్రహ్మ ఆ ఇద్దరు పిల్లలతో వెళ్ళి కిష్కింధలో వానరులకు రాజుగా ఉండమని చెప్పడంతో ఆ వానరుడు తన పిల్లలతో వెళ్లి కిష్కింధ నుంచి ప్రపంచంలో ఉండే వానరులందరికే చక్రవర్తి అయ్యాడు. అతనే రుక్షరజసుడు. మహా బలవంతులైన వాలి సుగ్రీవులకు తల్లీ తండ్రి రెండూ అతనే.


ఇదే కథ మరోలా
సూర్యుడి రథసారథి అరుణుడు. ఒకసారి అతను అప్సరసల వేడుకకు వెళ్ళాడు. ఇంద్రుడు తప్ప మరొక పురుషుడికి అక్కడ అనుమతి లేకపోవడంతో స్త్రీ రూపం ధరించి అరుణి పేరుతో అడుగుపెట్టాడు అరుణుడు. ఆ స్త్రీ రూపం చూసి మోహంలో పడ్డ ఇంద్రుడు ఆమెతో వాలి అనే బిడ్డను కన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు కూడా స్త్రీ రూపం ధరించమని కోరడంతో మరొకసారి అమ్మాయిగా మారిన అరుణుడితో సుగ్రీవుడిని కన్నాడు సూర్యుడు. ఆ ఇద్దరు పిల్లల్ని పెంచమని అహల్యకు ఇవ్వగా ఆమె భర్త గౌతమ మహర్షి మాత్రం ఒప్పుకోలేదు. పైగా తన భార్య వద్ద ఉన్న ఆ ఇద్దరు పిల్లల్ని వానరులు కమ్మని శపించాడు అనీ దానితో వారిద్దరికీ వానర రూపాలు వచ్చాయని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఎలా చూసినా రామాయణంలోని కీలక పాత్రలైన వాలీసుగ్రీవులు ఒక పురుషుడికి పుట్టిన వారు కావడం విశేషం.