చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి 50 కిలమీటర్ల దూరంలో పెనమలూరు లో ఉన్న రాతిపర్వమే పులిగుండు. భూమి నుంచి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతం ఎక్కితే ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతం, ప్రకృతి అందాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఈ రెండు పర్వతాలను పార్వతీ పరమేశ్వలుగా కొలుస్తారు. పూర్వం పులులు ఈ కొండ గుహల్లోనే తలదాచుకునేవని, అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. పులిగుండు పర్వతం మీదకు ఎక్కేందుకు రాతిమెట్లు, ఇనుప మెట్ల మార్గం అందుబాటులో ఉన్నాయి. వీటి మీద నుంచి పైకి చేరడమంటే సాహసమే అని చెప్పాలి. అప్పట్లో మెట్లు కూడా లేకపోవడంతో భక్తులు తాళ్లు, నిచ్చెనల సహాయంతో కొండపైకి చేరేవారు.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పేరు గాంచిన పులిగుండుకు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉంది. పూర్వం కార్వేటినగరం రాజుల పాలనలోని కల్లూరు, పాకాల, పాళ్యం,మొగరాల, పులిచెర్ల, రొంపిచెర్ల, నర్గతి, తుంబ పాలేగాళ్ళు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిలిచారు. దీంతో పాలెగాళ్లను పాలేగాళ్ళలను బ్రిటిషుల సైన్యం చుట్టు ముట్టడంతో ప్రాణ రక్షణ కోసం పులిగుండులోని గృహాలను ఆశ్రయించినట్లు చెబుతారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కాలక్రమేణా ఈ పర్వతాన్ని పులులు నివాసాలుగా ఏర్పచుకున్నాయి. ఈ పర్వతంపై నుంచి పులి గాండ్రిస్తే.. కొండల్లో మేతకు వెళ్లిన ఆవులు చెల్లాచెదురైపోయేవని చెబుతారు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఈ కొండల్లో కొలువై ఉన్న పులిగుండేశ్వర స్వామి ఆలయంలో ఉమామహేశ్వర స్వామి పార్వతి సమేతంగా కొలువైయున్నాడు. ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరుగుతుంటాయి. మరో ముఖ్యవిషయం ఏంటంటే ఈ పులిగుండుకి సమీపంలో ఉన్న మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తి స్వామి వారిని ముందుగా దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండ మధ్య భాగంలో విఘ్నేశ్వరుడు, శ్రీ వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి దేవతామూర్తులు కనిపిస్తారు. కొండ పై భాగంలో శివపార్వతులకు ఇరువైపులా అయ్యప్పస్వామి, నవగ్రహాల ఆలయాలు దర్శించుకోవచ్చు. పర్యాటక కేంద్రాల్లో పులిగుండు ఒకటిగా ప్రసిద్ది చెందడంతో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గదులు, రెస్టారెంట్, కళ్యాణమండపాలను ఏర్పాటు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు రెండు,మూడు రోజుల పాటు ఇక్కడ బస చేసి పులిగుండు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. తెలుగురాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోందంటున్నారు పర్యాటక శాఖాధికారులు.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట