Saraswati River Pushkaralu: సరస్వతి నదికి పుష్కరాలు వచ్చేస్తున్నాయ్. మే 15 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సందర్భంగా ఏదో ఒక సమయంలో పుష్కరనదిలో స్నానం ఆచరించడం మంచిది అని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. కుదిరితే స్నానం ఆచరించండి...ఇంకా కుదిరితే కొన్ని నియమాలు పాటించండి అని సూచిస్తున్నారు. 

పుష్కర స్నానం ఆచరించేందుకు నది దగ్గరకు వెళ్లే భక్తులు...ముందుగా గట్టుమీదున్న చిటికెడు మట్టిని తీసుకుని నీటిలో వేస్తూ ... పిప్పలాదాత్సముత్పన్నే క్రుత్యేలోక భయంకరిమృత్తికాంతే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయ 

ఈ శ్లోకాన్ని చదవాలి...

పుష్కర స్నానాలు జరిగే సమయంలో వేలమంది భక్తులు వస్తుంటారు, పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.. గట్లన్నీ మట్టిగా మారిపోతుంటాయి. వాటిపై తడి బట్టలతో వెళితే కాసేపటికే అంతా బురదమయం అయిపోతుంది. ఆ బురద నివారణ కోసం ఇలా చేయమని పెద్దలు చెప్పి ఉండొచ్చు. ఇక పుష్కర సమయంలో వేల మంది భక్తులు ఒకేసారి స్నానం ఆచరిస్తారు. ఆ సమయంలో చర్మవ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గట్టుమీదున్న ఒండ్రు మట్టిని నీటిలో వేస్తే...ఒండ్రుమట్టి చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. చర్మ వ్యాధులను రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

నదిలో స్నానం చేసేముందు నదిలో దిగి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి

పావని త్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే।

త్వయిస్నాతు మనుజ్ఞాంమేదేహి మహానదీ॥

మిథునగతే దేవగురౌ పితౄణాం తారణాయచ।

సర్వపాప విముక్త్యర్థం తీర్థ స్నానం కరోమ్యహం॥

తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైకపావనీ।

త్వయిస్నానం కరోమ్యద్య భవబంధవిముక్తయే॥

ఆ తర్వాత నదిలోకి దిగి సంకల్పం చెప్పుకుని...నదీ ప్రవాహానికి ఎదురుగా నిల్చుని స్నానం ఆచరించాలి. 

నదీ స్నానం ముగిసిన తర్వాత...సూర్యుడికి, సరస్వతి దేవికి, త్రిమూర్తులకూ, గురువుకి, పుష్కరుడికీ, అన్ని నదులకు, ఏడుగురు రుషులకు,  అరుంధతికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యాలు పూర్తయ్యాక నదిలో దక్షిణ దిశవైపు తిరిగి మరోమారు మునిగి పితృదేవతలకు నీటిని వదలాలి. 

స్నానం పూర్తై బయటకు వచ్చిన తర్వాత..విభూది, కుంకుమ పెట్టుకోవాలి.  

భూమ్మీద ఉన్న ప్రతిజీవి మనకుగడుకు జీవనాధారం నీరు. నీరు పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. పుష్కరాల సమయంలో స్నానం ఆచరిస్తే మోక్షం, ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. సకల పాపాలు నశిస్తాయంటారు. కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ నీటితో ముడిపడినవే. నదీతీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షానికి మార్గం అని పెద్దలు చెబుతారు. పితృదేవతలను ఉద్ధరించేందుకే భగీరదుడు గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణాల్లో ఉంది. తిలోదకాలు ఇచ్చామంటే వారికి స్వస్తి చెప్పామని అర్థం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మదేవుడి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధులు, ఔషధుల నుంచి అన్నం , అన్నం నుంచి జీవుడు పుట్టాడు. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు అందించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇది ప్రాధమిక సమాచారం మాత్రమే. వీటిని ఆచరించే ముందు అనుభవజ్ఞులైన పండితుల సలహాలు స్వీకరించండి