రోహిణి కార్తెలో ఎండ తీవ్రతకు రోళ్లు పగులుతాయ్ అని అంటారు. అది మాట వరసకే అన్నా.. అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే.. ఆ టైమ్‌లో కాలు బయటపెట్టాలంటేనే భయం వేస్తుంది. ఎండకాలం స్టారింగ్‌లో ఎలాగోలా తిరిగేయొచ్చు గానీ.. రోహిణి కార్తే వస్తేనే ప్రాణాలు విలవిల్లాడుతాయి. అది సరే.. రోహిణి కార్తెలోనే ఎండలు ఎందుకు ఇంత దంచి కొడతాయి? అసలు వాటికి కార్తె అని పేరు ఎలా వచ్చింది? రోహిణి కార్తె అని ఎందుకు పిలుస్తారనే సందేహం చాలామందిలో ఉంటుంది. వారి కోసమే.. ఈ వివరాలు.


సాధారణంగా జోతిష్యులు గ్రహాలు, నక్షత్రాలను ఆధారంగా చేసుకుని పంచాంగాలు, జతకాలను తయారు చేస్తారు. భానుడు ఉదయించేప్పుడు ఏ నక్షత్రం చంద్రుడికి సమీపంలో ఉంటుందో ఆ రోజుకు ఆ స్టార్ పేరు పెడతారు. అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇందుకు భిన్నంగా వ్యసాయ పంచాంగాన్ని రూపొందించారు. దాని ప్రకారమే.. వారు భానుడి గమనాన్ని.. వాతావరణాన్ని అంచనా వేస్తుంటారు. దాని ప్రకారం వారు నక్షత్రాలను ‘కార్తెలు’ అని పిలుస్తున్నారు. ఈ పంచాంగం ప్రకారం.. సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే.. ఆ టైమ్‌కు కార్తె అని పేరు పెట్టారు. అలా ఏడాదికి 27 కార్తెలు ఉంటాయి. రోహిణి 4వ నక్షత్రం.


(కార్తే అనేది సూర్యుని సంచారాన్ని తెలియజేసే పదం. సూర్యుడి సంచారం ఏ నక్షత్రంలో సాగుతుందనే విషయాన్ని బట్టి ఆ కార్తెకు పేరు ఉంటుంది. ఏడాది పొడవునా ప్రతి నక్షత్రంలో సూర్యుడు 13.5 రోజుల పాటు సంచరిస్తాడు.)


ఇలా ఏటా 27 కార్తెలు వస్తుంటాయి.. పోతుంటాయ్. కానీ, రోహిణి కార్తెను మాత్రం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. వేసవిలో వచ్చే రోహిణి కార్తెలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. వేసవిలో వచ్చే చివరి కార్తె ఇదే. రోహిణి కార్తె వెళ్లిన తర్వాత నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వర్షాలు.. చల్లదనం.. ఆపై మీకు తెలిసిందే.


ఇవే ఆ 27 కార్తెలు (నక్షత్రాలు)


01. అశ్వని 
02. భరణి 
03. కృత్తిక 
04. రోహిణి 
05. మృగశిర 
06. ఆరుద్ర 
07. పునర్వసు 
08. పుష్యమి 
09. ఆశ్లేష 
10. మఖ 
11. పుబ్బ 
12. ఉత్తర 
13. హస్త 
14. చిత్త 
15. స్వాతి 
16. విశాఖ 
17.అనూరాధ 
18. జ్యేష్ట 
19. మూల 
20. పూర్వాషాడ 
21. ఉత్తరాషాడ 
22. శ్రావణ 
23. ధనిష్ట 
24. శతభిషం 
25. పూర్వాభాధ్ర 
26. ఉత్తరాభాధ్ర 
27. రేవతి


ఈ ఏడు రోహిణి కార్తే


మన దేశంలో వ్యవసాయ పనులు ఈ కార్తెలను అనుసరించే జరుగుతుంటాయి. అంటే విత్తనాలు వెయ్యడం, ఎరువులు వెయ్యడం, కోత కొయ్యడం వరకు అన్ని కూడా కార్తెలను బట్టి చేస్తుంటారు. కార్తెలు వాతావరణ మార్పులను చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. ఏ కార్తెలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఎలాంటి వ్యవసాయ పనులకు అనుకూలమనేది కార్తెను బట్టి నిర్ణయిస్తారు. ఇది అత్యంత ప్రాచీనమైన భారతీయ పరిజ్ఞానం. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25 శనివారం రోజున ప్రారంభమైంది.


రోహిణి కార్తెలో సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ పదిహేను రోజుల కాలం అత్యంత వేడిగా ఉండే రోజులుగా పరిగణిస్తారు. సాధారణంగా రోహిణి కార్తే మే మూడవ వారంలో లేదా చివరి వారంలో ప్రారంభం అవుతుంది. 2024 సంవత్సరంలో రోహిణి కార్తే మే 25న ప్రారంభమై జూన్ 8న ముగుస్తుంది. రోహిణి కార్తెను వేసవిలో పతాక స్థాయిగా చెప్పవచ్చు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేంత ఎండ కాస్తుందనే నానుడి బాగా ప్రాచూర్యంలో ఉంది. ఈ సమయంలో తర్వాత కార్తెలో వచ్చే వర్షం కోసం ఎదురు చూస్తూ గడుపుతుంటారు. ఒకసారి తొలకరి కురవగానే తిరిగి వ్యవసాయ పనులు మొదలవుతాయి. దుక్కి దున్నుకోవడం, విత్తనాలు సిద్ధం చేసుకోవడం వంటి పనులు మొదలవుతాయి.


ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి


రోహిణి కార్తె అత్యధిక వేడిగా ఉండే రోజులు కనుక ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కనుక శరీరం ఖనిజలవణాలను పెద్ద మొత్తంలో కోల్పోతుంది. కాబట్టి త్వరగా అలసి పోతుంటారు. అలా జరగకుండా తరచుగా ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్‌లో చల్లబరిచిన నీళ్ల కంటే మట్టి కుండలో నీళ్లు తాగడం మంచిది. ఎక్కువ ఘాటైన మసాలాలు కలిగిన ఆహారం తీసుకోవద్దు. ఇవి శరీరంలో మరింత వేడి పెంచి వేడి చేస్తుంది. అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో తాపం పెరుగుతుంది.


శరీరాన్ని చల్లబరిచేందుకు రెండు పూటల స్నానం చెయ్యగలిగితే మంచిది. నీటికి కొరత లేని వారు ఈ చిట్కా తో తాజాగా, చల్లగా ఉండవచ్చు. వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లేత రంగుల దుస్తులు ఎంచుకోవడం మంచిది. పసిపిల్లలు ఉన్నవారు వారికి తరచుగా తడిగుడ్డతో తుడుస్తుంటే వేడి వల్ల చికాకు పడకుండా ఉంటారు.


Also Read : Anger Management Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.