సొరకాయల స్వామి: హిందూ సాంప్రదాయంలో ఆలయాలకు ప్రత్యేక స్ధానం ఉంది. దేవతామూర్తుల ఆలయాల మొదలు వారి అవధూతల ఆలయాల వరకూ అన్నీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. షిరిడి సాయిబాబా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, శారదామయి, యుక్తేశ్వరగిరి, కుసుమహరనాధులు, శ్రీ అరవిందులు వాంటివారంతా ఏదో ఒక కార్యం నెరేవేర్చేందుకే భూమిపై జన్మించారని విశ్వసిస్తారు. ఈ కోవకు చెందినవారే సొరకాయల స్వామి. ఆయన జీవసమాధి అయిన ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏదైనా కోరుకుని ముడుపు కడితే అది తప్పనిసరిగా నెరవేరుతుందని చెబుతారు. ఇంతకీ ఎవరీ సొరకాయల స్వామి...
ఎలాంటి జబ్బు అయినా నయం అయ్యేది: తిరుపతి జిల్లా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. ఆయన పేరు ఎవ్వరికీ తెలియదు కానీ ఓ అవధూత ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నయం చేస్తుండేవారట. అందుకు ప్రతిఫలంగా ఎండిన సొరకాయ దొప్పలో భిక్షను స్వీకరించేవారట. తీవ్ర అనారోగ్య సమస్యలు నయం చేస్తున్న స్వామివారిని ధన్వంతరిగా పిలుచుకునేవారంట. చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తూ సొరకాయల్లో బిక్షను స్వీకరించడంతో సొరకాయల స్వామీజీ అనే పేరు స్థిరపడిపోయింది. భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుతున్న సమయంలో అనారోగ్యంతో బాధపడేవారు ఎవరు కనిపించినా తనవెంట తెచ్చిన బూడిద, వేప, పసుపు సహా మరికొన్ని ఔషధాలు ఉపయోగించి జబ్బు నయం చేసేవారట. దీంతో ఈయనను వైద్యుడిగా చూసేవారు. మరోవైపు అప్పట్లో నారాయణ వనంలో జరిగిన కొన్ని క్షుద్రపూజల్ని ఆగేలా చేసి ప్రజలను రక్షించారట.
202 ఏళ్లు బతికి జీవసమాధికి వెళ్లిన స్వామి: తమిళనాడు రాష్ట్రం కోమలేశ్వరపురంలో శ్రీనివాస పిళ్ళై పుత్తూరులో కట్టించిన సత్రం లెక్కల్లో సొరకాయల స్వామి వారి ప్రస్తావన ఉంది. ఈ లెక్కల ఆధారంగా ఈయన క్రీ.శ.1700లో జన్మించి, 1902వ సంవత్సరం శ్రావణమాసం గరుడపంచమి రోజు జీవ సమాధిలోకి వెళ్లారని చెబుతారు. అంటే దాదాపు 202 సంవత్సరాలు బ్రతికినట్లు ఆధారాలున్నాయంటున్నారు. 1902లో మద్రాసులో కొన్నాళ్ళు పాటు సంచరించారని ఆ తర్వాత తిరుమలేశుడిని దర్శించుకుని పద్మావతి అమ్మవారికి- శ్రీ వేంకటేశ్వరుడుకి వివాహం అయిన పవిత్రమైన చోటు నారాయణవనంలో స్ధిర పడినట్లు తెలుస్తొంది. ఆయన జీవసమాధి అయి దాదాపు 119 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ను పూజిస్తున్నారు భక్తులు.
ధుని నుంచి తీసే బూడిదే ప్రసాదం: సొరకాయల స్వామి వారు జీవ సమాధి అవుతున్న సమయంలో ఆయన స్వయంగా ధునిని వెలిగించారట. అది ఇప్పటికీ 24 గంటలపాటూ వెలుగుతూనే ఉంటుందట.వివిధ రకాల సమస్యలతో వచ్చే భక్తులు స్వామి వారిని అఖండ జ్యోతిలా వెలిగే ధుని ముందు కూర్చుని ప్రార్ధిస్తే తమ కష్టాలు అన్ని దూరం అయ్యి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ధుని నుంచి తీసిన బూడిదే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అదే దివ్యఔషధం అన్నది భక్తుల విశ్వాసం.
దుష్టశక్తులను తరిమేసే ఆలయం: దుష్టశక్తులు ఆవహించినా, మానసిక రుగ్మతలు, ఆర్ధిక ఇబ్బందులు, వివాహం కానివారు, పిల్లలు లేనివారు ప్రతి అమావాస్య, పౌర్ణమి ముందు రోజు రాత్రి 10-12 గంటల సమయంలో జరిగే బుట్ట పూజలో పాల్గొంటారు. ఆలయంలో జరిగే బుట్ట పూజలో పాల్గోని ఆలయంలో ఓ రాత్రి నిద్రిస్తే సమస్యలు తొలగి పోతుందని నమ్మకం. తమిళనాడు,ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు నారాయణవనంలో స్వామి ఆలయంకు చేరుకుని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సొరకాయల స్వామికి ఘనంగా పూజచేస్తారు. కోర్కెలు నెరవేరిన వారు తిరిగి ఆలయానికి చేరుకుని స్వామివారి జీవసమాధి దర్శించి సొరకాయలు ముడుపులుగా కడుతుంటారు. ఇలా భక్తులు ముడుపుగా కట్టిన సొరకాయలు ఆలయంలో ఓ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.
స్వామి వారు జీవించిన సమయంలో ఉపయోగించిన సొరకాయ బుర్ర, దూదివస్త్రాలు, పాదరక్షలు, వస్త్రాలూ, ఇత్తడి బిందె, కట్టెలకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, శునకాల కట్టేందుకు ఉపయోగించిన తాళ్లు భక్తుల సందర్శనార్తం ఆలయంలో ఉంచారట.