Pushya Masam 2022-2023 in Telugu: శుభ ముహూర్తాలకు శూన్య మాసమైనా పండుగలకు పూర్ణ మాసం పుష్య మాసం. ఎందుకంటే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు కానీ నెలంతా పండుగలే.


Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు


పుష్యమాసానికి ఉన్న ప్రత్యేకత



  • ఈ నెలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దక్షిణాయం ముగిసేది.. ఉత్తరాయణం ప్రారంభమయ్యేది ఈనెలతోనే

  • ముక్కోటి ఏకాదశి వచ్చేది ఈ నెలలోనే . వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం తెరచి ఉంచుతారు. భక్తులందరూ ఆ ద్వారం గుండానే స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడనటానికి చిహ్నం ఈ ఉత్తరద్వార దర్శనం!

  • అయ్యప్ప దీక్షలు ఎక్కువగా పుష్యమాసంలోనే ఉంటాయి..సంక్రాంత్రికి మకరజ్యోతి దర్శనం కూడా ఇందులోకే వస్తుంది

  • దైవారాధానకు ఎంతో ప్రాముఖ్యత ఉండే పుష్యమాసంలో పితృదేవతలను కూడా పూజిస్తారు

  • పంచాయతన పూజా విధానం ప్రకారం చూస్తే...గణపతిని భాద్రపద మాసంలో, అమ్మవారిని ఆశ్వీయుజ మాసంలో, శివుని కార్తీక మాసంలో, విష్ణువుని మార్గశిర మాసంలో, సూర్య నారాయణుడిని పుష్య మాసంలో విశేషంగా కొలుస్తారు.

  • గోదాదేవి శ్రీ రంగనాథుని తిరుప్పావై పాశురములతో అర్చించి, రంగనాథుని కళ్యాణం చేసుకొని శ్రీ రంగనాథునిలో లీనమై పోయింది పుష్య మాసంలోనే

  • గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీ కృష్ణుని వివాహం చేసుకున్నది పుష్య మాసంలోనే. అందుకే పెళ్ళి కాని ఆడ పిల్లలు వివాహం కోసం ఈ నెలలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు

  • భోగి పండుగ, సంక్రాంతి సంబరం, కనుమ హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది..ఆ సందడే వేరు ఇవన్నీ  పుష్య మాసంలోనే

  • భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు

  • మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినం, మకర సంక్రాంతి..ఈ రోజు నుంచీ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది

  • పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు  

  • ఈ నెలలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు..గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం...

  • పంటలు చేతికొచ్చే సమయం కూడా పుష్య మాసమే. కొత్త బియ్యం, కొత్త బెల్లం, నువ్వులు ఇవన్నీ పొలాల నుంచి రైతుల ఇంటికి చేరుతాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయం కాబట్టి.. నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీరం ఉష్ణోగ్రత పెంచి చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి.


Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు


జ్యోతిష్య పరంగా పుష్యమాసం విశిష్టత



  • జోతిష్యం పరంగా చూస్తే జాతకంలో సూర్య గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, జపాలు, హోమాలు, దానాలు చేయటానికి పుష్య మాసం మంచి సమయం

  • శని జన్మ నక్షత్రం పుష్యమి. శని గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, శని గ్రహానికి జపాలు, హోమాలు, దానాలు చేయటానికి కూడా మంచి సమయం

  • ఈ నెలంతా వేకుల జామునే నిద్రలేచి శనిని పూజించిన వారిపై శనిదోషం తగ్గుతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు

  • ఏలినాటి శనితో బాధపడేవారు ఈ నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి శనిని పూజిస్తారు..పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు.