Ayodhy Ram Temple : పూజారి కుటుంబంలో జననం కానీ మరణం కానీ సంభవించినప్పుడు ఆయా సమయంలో పాటించాల్సిన నియమాలు,  సూతకం ఉన్నన్ని రోజులు రామ మందిరంలోకి ప్రవేశించరాదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు


అయోధ్య రామ మందిరంలో పూజారులకు మార్గదర్శకాలు జారీచేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అదే సమయంలో పూజారుల డ్రెస్ కోడ్ వివరాలు కూడా వెల్లడించారు. నడుము కింద నుంచి కిందవరకూ చౌబందీ.. పై భాగంలో తలపాగా దానినే సఫా అంటారు..ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు .


చలికాలం కావడంతో ఉన్నిదుస్తులు ధరించవచ్చు కానీ అవి కాషాయ రంగులో మాత్రమే ఉండాలనే నియమం విధించారు.


పూజా సమయాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించరాదని..ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండడం నిషిద్ధం అన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు సాధారణ ఫోన్ తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా. 


Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!


ఆరు నెలల పాటూ శిక్షణ పూర్తిచేసుకున్న అర్చకులు త్వరలో రామమందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే విధుల్లో చేరనున్నారు 


ఈ మధ్యే అయోధ్య రామ మందిరంలో పూజారుల నియామకం కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని అనిల్ మిశ్రా తెలియజేశారు. ఈ మేరకు అత్యంత అర్హత కలిగిన 20 మంది వ్యక్తుల బృందం.. ఎంపిక చేసిన 20 మంది పూజారులకు ఆరు నెలల పాటూ శిక్షణ ఇచ్చారన్నారు. 


రామ మందిరం మతపరమైన కమిటీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. రామజన్మభూమి సముదాయంలో మొత్తం 18 దేవాలయాల్లో పూజారులు రొటేషన్ పద్ధతిలో పూజల్లో పాల్గొంటారు. 


ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయినా జననం, మరణం సంభవించినప్పుడు ఆ సమయంలో ఆలయంలోకి ప్రవేశించరాదని స్పష్టంగా చెప్పారు అనిల్ మిశ్రా. ఈ విధి విధానాలు పాటిస్తామని ప్రమాణం చేసిన వారినే రామ మందిరంలో పూజారులుగా నియమిస్తామని మార్గదర్శకాల్లో ఉందన్నారు.


Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!


భక్తులు పాటించాల్సిందే..


అయోధ్య రాముడిని దర్శించుకోవాలి అనుకున్న భక్తులకు కూడా నిబంధనలు పాటించాల్సిందే. శ్రీరామ చంద్రుడి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ అనుసరించాలి.  కేవలం సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయంలో అడుగుపెట్టాలి. పురుషులు అయితే ధోతి, కుర్తా-పైజామా...మహిళలు అయితే చీర, సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించాలి. వెస్ట్రన్ డ్రెస్సులతో వచ్చేవారిని రామ్ లల్లా దర్శనానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, ఇయర్ ఫోన్లు, రిమోట్ తో కూడిన వస్తువులు ఆలయంలోకి తీసుకెళ్లేందుకు నిషిద్ధం.


బాల రాముడి వార్షికోత్సవ వేడుక


అయోధ్యలో బాలరాముడు కొలువు తీరి ఏడాది దగ్గరకొచ్చేస్తోంది. అందుకే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  రామాలయ వార్షికోత్సవ వేడుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రామయ్య కొలువుతీరింది జనవరి 22న కానీ..జనవరి 11నే వార్షికోత్సవం నిర్వహించనున్నారు. పది రోజుల ముందే వార్షికోత్సవం నిర్వహణ వెనుక కారణం కూడా స్పష్టం చేశారు ట్రస్ట్ సభ్యులు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని  ఏటా పౌష్య శుక్ల ద్వాదశి రోజు అంటే కూర్మ ద్వాదశి రోజు నిర్వహించాలని... 2025 లో ఈ తిథి జనవరి 11న వచ్చిందని తెలిపారు. అందుకే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ వేడుక జనవరి 11న జరగనుంది.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయేన్నమః


Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!