Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలా రాకపోకలు సాగిస్తే ఏవైనా ఉపద్రవాలు జరుగుతాయని ఆగమ శాస్త్ర పండితులు చాలాసార్లు టీటీడీకి సూచించారు. స్పందించిన టీటీడీ అధికారులు ఆలయంపై   విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని..నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది.
 
జనవరి 02న శ్రీవారి ఆలయం సమీపంలో విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఈ విషయంపై టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదుచేసినా అదే జరుగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరగడంతో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం హమీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇది కూడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే గత కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు సాగుతున్నాయి. 


Also Read: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!


టీటీడీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విమానయాన అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానయాన శాఖ త్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు  జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోట్లాది భక్తులు విశ్వసించే తిరుమల ను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటున్నారు.  


గత 6 నెలల కాలంలోనే  రెండుసార్లు విమానాలు ఆలయం మీదుగా వెళ్లటం పై  అధికారులు నేరుగా విమానయాన శాఖతో చర్చించారు. జూన్ 7 ఉదయం 8.14 గంటలకు శ్రీవారి ఆలయంపై విమానం ప్రయాణించింది. అంతకుముందు ఫిబ్రవరి 15న కూడా శ్రీవారి ఆలయం గోపురంపైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి.  


తిరుపతికి సమీపం రేణిగుంటలో విమాశ్రాయం ఉంది, మరోవైపు తిరుపతి సమీపంలో ఉన్న చెన్నైలోనూ విమానాశ్రయం ఉంది. అందుకే తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ప్రాయాణించే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆగమశాస్త్ర నిబంధనలు, శ్రీవారి ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు భక్తులు. 


Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!


కలియుగదైవం కొలువైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. సుప్రభాత సేవ నుంచి స్వామివారి పవళింపు సేవవరకూ రోజంతా తిరుమలేశుడికి ప్రత్యేక పూజలు, సేవలు, అలంకారాలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి. ఏడాదికి ఓసారి అయినా తిరుమల వెళ్లిరావాలని భావించే భక్తులెందరో. మరికొన్ని రోజుల్లో వైకుంఠ ఏకాదశి వస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపైనుంచి విమానాల రాకపోకలు సరికాదన్నది భక్తుల అభిప్రాయం. ఇలా జరగడం ఆగమశాస్త్ర ఉల్లంఘనే అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. మరి ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించి నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.


Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!