భద్రాచలంలో కొలువైన సీతారామచంద్రస్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. రాముడి వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా ఉండటం ఇందుకు కారణం..


భద్రాచలం పట్టణం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో  సీతమ్మవారి పర్ణశాల ఉంది. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 


పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ప్రాశస్తి. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుంచే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట.






సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోచాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మ గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధగుట్ట’పై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇప్పుడు కూడా నాటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది.






పర్ణశాల పవిత్రక్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దింది. చుట్టూ అందమైన గుట్టల నడుమ గోదావరి పరవళ్లు ఇక్కడికి వచ్చే వారిని ఆకర్షిస్తుంది. పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటు చేశారు. 


ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది.