ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో ఒకటి నెల్లూరు జిల్లా వేదగిరి లక్ష్మీ నారసింహ క్షేత్రం. పెన్నా నది ఒడ్డున నరసింహకొండపై వెలసిన లక్ష్మీనారసింహుడు భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నాడు. నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో నరసింహకొండ క్షేత్రం ఉంది. పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని, యాగ పూర్ణాహుతి నుంచి వెలసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీనారసింహ స్వామి అని చెబుతారు పండితులు. 



పల్లవ రాజులు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతారు. వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు. స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే పది కాలాలపాటు పిల్లాపాపలతో ఆనందంగా ఉంటారని నమ్మకం. ఇక ఆలయంలో సంతాన వృక్షానికి చీరకొంగు చించి ముడుపు కడితే కచ్చితంగా పిల్లలు పుడతారని అంటారు. గ్రహబాధలు, ఈతి బాధలు ఉండేవారు రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామి స్వప్నంలో కనిపిస్తారని, మహిమ చూపిస్తారని చెబుతారు. సప్త మహర్షులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ గిరికి వేదగిరి అనే పేరొచ్చింది. 



ఇక్కడ స్వామివారి ఆలయంతోపాటు ఏడు కోనేరులు ప్రసిద్ధి. కశ్యప మహర్షి ఏడు హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతర కాలంలో అవి ఏడు కోనేరులుగా రూపాంతరం చెందాయని అంటారు. కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. 


తొలి అడుగు


నెల్లూరులోని రంగనాథ ఆలయానికి, నరసింహకొండపై ఉన్న నారసింహుడి దేవస్థానానికి సంబంధం ఉంది. రంగనాథుడి ఉత్సవాలు ముగిసే సమయంలో, నరసింహ కొండనంచి నారసింహుడిని ఎదుర్కోలుగా తీసుకెళ్తారు. వారిద్దరి మధ్య సంవాదం, ఎదుర్కోలు ఉత్సవంగా నెల్లూరులో ఘనంగా జరుగుతుంది. ఇదే క్షేత్రంపై వెంకటేశ్వర స్వామి తన పాదముద్రను వదిలివెళ్లారంటారు. తిరుమల గిరికి వెళ్లే సమయంలో వెంకటేశ్వరుడి ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తుల నమ్మిక. అందుకే ఇక్కడ ఆయన పాదముద్రకి పూజలు చేస్తుంటారు భక్తులు. 




ప్రతిరోజూ ఇక్కడకు భక్తులు తరలి వస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలవారు, నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేవారు నరసింహ కొండకు కచ్చితంగా వస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం ఉంది. అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులు కచ్చితంగా నరసింహ కొండ కూడా వస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది ఈ ప్రాంతం. కొండపై వెలసిన లక్ష్మీనారసింహుడి దర్శనం ఎన్నో శుభాలు కలిగిస్తుందని చెబుతుంటారు భక్తులు. 


నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ప్రతిరోజూ భక్తులతో సందడిగా ఉంటుంది నరసింహకొండ క్షేత్రం. నెల్లూరు నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. నెల్లూరు నగరానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం ఉన్నాయి. నెల్లూరు నగరానికి వచ్చిన తర్వాత ఆటో లేదా ప్రైవేటు వాహనాల్లో నరసింహ కొండ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం చాలా తక్కువ.