Famous Ayyappa Temples in AP & Telangana: 41 రోజుల నియమనిష్ఠలతో మండల దీక్షను పూర్తి చేసిన అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లి 18 మెట్లు ఎక్కి ఇరుముడి సమర్పించి స్వామిని చూసి పులకించిపోతారు. అయితే శబరిమల వెళ్లే అవకాశం లేని భక్తులు అసంతృప్తి చెందవద్దు, ఆందోళన వద్దు.. భగంతుడు సర్వాంతర్యామి. అంతటా వ్యాపించి ఉన్నాడు. సంప్రదాయాలను అనుసరించి మాలవిరమణ శబరిమలలోనే జరగాలి..కానీ వివిధ కారణాల వల్ల అది అసాధ్యం అయితే ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ..గురుస్వాములు, ఆధ్యాత్మికవేత్తల సలహాతో మాలవిరమణ చేయొచ్చు. మండల దీక్షలో భాగంగా బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం తీసుకోవడం, శుచిశ్రవణం, శరణు ఘోష ఇవన్నీ ఎలా పాటిస్తారో..మాల విరమణ సమయంలోనూ అంతే భక్తి శ్రద్ధలు ఉండాలి. గురుస్వామి లేదా ఆలయ పూజారి ద్వారానే మాలవిరమణ జరగాలి. ఉత్తరాయణ శుభముహూర్తంలో మాలవిరమణ అత్యంత శుభప్రదం అని చెబుతారు. ఏవైనా జరగకూడని సంఘటనలు జరిగినా, వినకూడని వార్తలు విన్నా..మార్గ మధ్యలో మాల విరమణ చేయకూడదు. ఇంటికి లేదా పీఠానికి చేరుకున్న తర్వాతే విరమణ చేయాలి.
ఇక శబరిమల వెళ్లలేని భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రత్యేక ఆలయాలున్నాయి.. ఇక్కడ మాల విరమణ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని ఆలయాల్లో పడిమెట్లు, ఇరుముడి సమర్పణ, మకరజ్యోతి దర్శనం లాంటి శబరిమల సంప్రదాయాలు పాటిస్తాయి. కంచి పీఠాధిపతి జేయంద్ర సరస్వతి లాంటివారు ఈ ఆలయాలను ప్రతిష్టించారు ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం (Andhra Sabarimala Ayyappa Temple ) తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరం ద్వారపూడి లో ఉంది అయ్యప్ప స్వామి ఆలయం. ఇది 1989లో కంచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ప్రతిష్టించారు. శని దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మల్లాపురం అయ్యప్ప స్వామి ఆలయం (Chinna Mallapuram - Andhra Sabarimala Sri Ayyappa Swamy Temple )
కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో పెదమల్లాపురంలో ఉంది అయ్యప్ప స్వామి ఆలయం. ఇక్కడ కన్నెమూల గణపతి, మాళీగైపురతమ్మ ఆలయాలను దర్శించుకోవచ్చు. 2011లో ఆలయ నిర్మాణం పూర్తైంది. నిత్యం ఉదయం 6 గంటల నుంచి 1 వరకూ.. మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 గంటలవరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉభయగోదావరి జిల్లాల భక్తులకు సౌకర్యంగా ఉంటుంది శంషాబాద్ అయ్యప్ప స్వామి ఆలయం (Sri Ayyappa Swamy Temple, Mylavaram Road)
శంషాబాద్ అంటే హైదరాబాద్ లో ఉన్నది కాదు..కృష్ణా జిల్లాలో మరొకటుంది. మైలవరం నియోజకవర్గంలో ఉన్న శంషాబాద్ విజయవాడ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆలయం పూర్తిగా శబరిమలను పోలి ఉంటుంది. ఇరుముడి సమర్పణ, పడిమెట్లు, మకరజ్యోతి దర్శనం ఇక్కడ చాలా ప్రత్యేకం. కృష్ణా జిల్లా అయ్యప్ప భక్తులు మాలవిరమించేందుకు ఈ ఆలయం సౌకర్యవంతంగా ఉంటుంది
బొల్లారం అయ్యప్ప ఆలయం (Sree Ayyappa Devasthanam)
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఆలయం ఇది. ఏపీ తెలంగాణలో ఉన్న అయ్యప్ప ఆలయాల్లో అత్యంత పురాతనమైనది. 1975లో మలయాళీ సంఘాలతో నిర్మితమైన ఆలయం..కేరళ పూజా విధానాలను అనుసరిస్తుంది. శబరిమల ఆలయ ముఖ్య పూజారి ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతోంది. అయ్యప్ప మాల విరమణ ఇక్కడ చేయొచ్చు
అయ్యప్ప స్వామి మందిరం ( Ayyappa Temple Nandigama)
హైదరాబాద్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ORR సమీపం నందిగామ దగ్గరుంది అయ్యప్పస్వామి ఆలయం. గురు బ్రహ్మ సతీసన్ నాయర్ గురుస్వామి నిర్మించిన ఆలయం ఇది. కార్తీకమాసం మొత్తం ఇక్కడ మాలవిరమణధారులతో కళకళలాడుతుంది. కేరళ శైలిలో తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద ఆలయం ఇది . ఇక్కడ మండల పూజలు వైభవంగా జరుగుతాయి. ఏటా నవంబర్ 16,17 తేదీల్లో మండల పూజలు ప్రారంభమవుతాయి.
సనత్‌నగర్ అయ్యప్ప గుడి (Shri Ayyappa Swamy Temple, Sanathnagar)
హైదరాబాద్ సనత్‌నగర్ లో ఉన్న అయ్యప్ప ఆలయం మాల విరమణకు ప్రసిద్ధి. 1970ల్లో అయ్యప్ప భక్త సంఘాల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం ఇది. తెలంగాణలో ఎక్కువ మంది పోలీస్ భక్తులు ఇక్కడ మాల విరణమ చేస్తారు
అర్యంకావు శాస్తా ఆలయం (Aryankavu Shasta Temple) (ఆంధ్ర సరిహద్దుల్లో)
అర్యంకావు శాస్తా ఆలయం..కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ అయ్యప్ప ఆలయం. ఇది పత్తనంతిట్ట జిల్లాలో ఉన్నప్పటకీ ఏపీకి సమీపంలో, తమిళనాడు సరిహద్దు తిరునల్వేలి జిల్లా సమీపంలో ఉంటుంది. కేరళలో 5 అయ్యప్ప ప్రధాన ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ కూడా మాలవిరమణ చేయొచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని పరుశరాముడు ప్రతిష్టించాడని స్థలపురాణం ఇంకా నర్సంపేట (వరంగల్), భగత్‌నగర్ (కరీంనగర్), పెద్దపల్లి (సుల్తానాబాద్) సహా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అయ్యప్ప ఆలయాలున్నాయి. అయితే మాల విరమించేందుకు ఆధ్యాత్మికవేత్తలు, గురుస్వాముల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప!