Tulsi Puja Tips: సనాతన ధర్మంలో తులసికి విశేష ప్రాధాన్యత ఇస్తారని మనందరికీ తెలుసు. హిందూ సంప్రదాయాలను పాటించే ప్రతి ఇంట్లో తులసి మొక్కను మనం చూడవచ్చు. తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి ప్రతి ఇంటిలో పూజిస్తారు. తులసి ఔషధం మాత్రమే కాదు. అది దైవిక శక్తిని కలిగి ఉంటుంది. ఎవరి ఇంట్లో తులసి ఉంటే వారికి సంపద, ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కకు సంబంధించిన నియమాలను పాటించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్ష వీక్షణం కూడా మనపై ప్రసరిస్తుంది. మీ ఇల్లు సుభిక్షంగా, సానుకూల శక్తికి నిలయంగా ఉండాలంటే తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు మీరు ఈ నియమాలను పాటించండి.
స్నానం చేయకుండా వద్దు
హిందూ శాస్త్రం ప్రకారం, స్నానం చేయకుండా తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత నీరు సమర్పించకూడదు. ఈ తప్పులు చేయడం వల్ల మీరు విష్ణుమూర్తి ఆగ్రహానికి మాత్రమే కాకుండా లక్ష్మీ దేవి ఆగ్రహానికి కూడా గురవుతారు. లక్ష్మీనారాయణుల కోపం కారణంగా, మీ ఇంట్లో కష్టాలు, పేదరికం వ్యాపిస్తాయి.
అలాంటి వస్త్రాలు ధరించినప్పుడు
మత విశ్వాసాల ప్రకారం, తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు మీరు కుట్టిన వస్త్రాలు ధరించరాదని గుర్తుంచుకోండి. అంటే కుట్టని దుస్తులు వేసుకున్నాకే తులసి మొక్కకు నీళ్లు పోయాలి. కుట్టిన దుస్తులు ధరించి తులసి మొక్కకు నీరు పోయడం వల్ల పూజ చేసిన ఫలితం ఉండదు.
ఈ 2 రోజులు నీరు పోయకండి
మత విశ్వాసాల ప్రకారం, మీరు వారంలో రెండు రోజులు తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఆదివారం, బుధవారం పొరపాటున కూడా తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ రోజున తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో మీరు నీరు పోయడం వలన ఆమె విశ్రాంతికి భంగం కలుగుతుంది. ఫలితంగా మీరు ఆమె కోపానికి కూడా గురి కావచ్చు.
ఈ రోజు కూడా నీరు పోయవద్దు
వారంలోని ఆది, బుధవారాలతో పాటు ఏకాదశి రోజున కూడా తులసికి నీరు సమర్పించకూడదు. ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కావడంతో, ఈ రోజు విష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆయన కోసం ఉపవాసం ఉంటుంది. ఆమె ఏకాదశి రోజున నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటుంది కాబట్టి, మీరు నీళ్లు పోస్తే ఆమె వ్రతం చెడిపోవచ్చు. ఇది కూడా ఆమె కోపానికి కారణం కావచ్చు.
ఆ నీరు నేలపై పడకూడదు
తులసి మొక్కకు నీరు పోసే సమయంలో మనం కొన్ని విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు ఎత్తులో ఉన్న తులసికి నీరు పోస్తుంటాము. ఇది ఒక వైపు తులసి మొక్క చెడిపోవడానికి దారి తీస్తుంది, మరోవైపు తులసికి అందించే నీరు నేలపైకి వెళ్లడం అశుభకరమని భావిస్తారు. మీరు తులసి మొక్కకు పోసే నీరు ఎప్పుడూ తులసి కోట దాటి కింద పడకూడదని గుర్తుంచుకోండి.
Also Read : తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు - ఇలా వాడితే, ఆరోగ్యం మీ సొంతం
ఇదే సరైన సమయం
కొంతమంది సూర్యోదయం సమయంలో, మరికొందరు సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కను పూజించడం మీరు చూసి ఉండవచ్చు. కానీ తులసిని సూర్యోదయ సమయంలో మాత్రమే పూజించాలి, ఈ సమయంలో నీరు సమర్పించడం శుభప్రదం. అయితే, తులసి మొక్కకు సంధ్యా సమయంలో లేదా సూర్యాస్తమయం సమయంలో నీరు పోయకూడదు. ఈ సమయంలో తులసి పూజ చేయాలి. అయితే ఈ సమయంలో తులసి మొక్కను తాకకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.