సాధారణంగా మనకు గ్రహణాలు వచ్చినప్పుడు వివిధ రకాల గ్రహణ నియమాలను చెబుతుంటారు. అందులో ముఖ్యమైనది వివిధ వస్తువులు, ఆహార పదార్థాలపై దర్భ గడ్డిని ఉంచడం. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా దర్భ గడ్డి వేయడం అనేది ప్రముఖంగా చెబుతున్నారు పండితులు. మరి కేవలం గ్రహణ సమయంలోనే దర్భ గడ్డి ఎందుకు వస్తువులపై వేస్తారు? అసలు దర్భలకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటీ?


ఈ సంవత్సరం చంద్రగ్రహణం నవంబర్ 8న మంగళవారం, కార్తీక పూర్ణమి రోజున వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షికంగా ఏర్పడితే, తూర్పు ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా ఏర్పడుతోంది.


దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 8న సాయంత్రం 5.32 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయం నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. గ్రహణం ప్రారంభం నుంచి మోక్షం వరకు ఉన్న సమయాన్ని గ్రహణ కాలం అంటారు. ఈ కాలం కన్నా తొమ్మిది గంటల ముందు ఉన్న కాలాన్ని సూతక కాలం అంటారు. అది ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వివిధ వస్తువులపై దర్భలను వేసి ఉంచాలి.


దర్భల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణగాధలు


దర్భలలో మూడు రకాల దర్భలున్నాయి. మామూలు దర్భ జాతి.. వాటిని అపరకర్మలలో, కుశ జాతి దర్భలను శుభకార్యాలలో, బర్హిస్సు జాతికి సంబంధించిన దర్భలను యాగాలలో, వివిధ రకాల క్రతువులలో వాడుతారు. అసలు ఈ దర్భలు ఎలా ఆవిర్భవించాయి? అనేదానిపై రకరకాల పురాణ గాధలున్నాయి. కూర్మ పురాణం ప్రకారం , కూర్మావతారంలో క్షీరసాగర మథనం జరిగేటప్పుడు విష్ణుమూర్తి తాబేలు రూపంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, కూర్మం శరీరం మీద ఉండే వెంట్రుకలు.. సముద్రంలో పడిపోయి, ఒడ్డుకు కొట్టుకుని వచ్చి కుశముగా మారాయనీ, ఆ సమయంలో అమృతం చుక్కలు వాటిమీద పడడం వల్ల వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడిందనీ అంటారు. ఇక వరాహపురాణం ప్రకారం అవి విష్ణుమూర్తి వెంట్రుకలని చెబుతారు. మరో కథ ప్రకారం ఇవి విశ్వామిత్రుడి సృష్టి అని కూడా ఉంది. అంతేకాదు ఈ దర్భలను ఎప్పుడుపడితే అప్పుడు కోయకూడదు కూడా. పుష్యమి నక్షత్రం, ఆదివారం రోజున వాటిని కోయడం చాలామంచిది. అలా వీలు కాని పక్షంలో మంచి రోజు చూసి కోస్తారు.


ప్రత్యేకించి గ్రహణ సమయంలోనే ఎందుకంటే


ఇంత పవిత్రత కలిగి ఉన్నందున వీటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు. ప్రత్యేకించీ ఈ గ్రహణ సమయంలోనే ఎందుకు వాడతారంటే, గ్రహణ సమయంలో సూర్యుడు, లేదా చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంది. సాధారణంగా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు మనిషి శరీరంపైన శారీకంగానూ, మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్లుగానే చంద్రుడిని మనః కారకుడిగా చెబుతుంటారు. అలా సూర్య, చంద్రులిరువురూ మానవుని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారన్నమాట. మరి గ్రహణ సమయంలో వారి శక్తి సన్నగిల్లుతుంది. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే దర్భలను ఉపయోగించాలని చెబుతుంటారు. కొన్ని వస్తువులు, ముఖ్యంగా తినే పదార్థాలపై దర్భలను ఉంచినట్లయితే ఆ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని 1982-83 సంవత్సరాలలో సూర్యగ్రహణ సమయంలో చేసిన శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైంది కూడా. ఇలా శాస్రీయపరంగానూ, సంప్రదాయపరంగానూ ఈ గ్రహణ సమయంలో దర్భలను వాడడం అతిముఖ్యమైనదిగా చెప్పవచ్చు.


Also Read: నవంబరు 8న చంద్రగ్రహణం, పట్టు-విడుపు సమయాలు, ఏ రాశులవారు చూడకూడదంటే!