భారతదేశంలో రాముడి ఆలయం లేని ఊరు ఉండదంటారు. నాలుగు గడపలు ఉన్నా అక్కడ రాములవారి ఆలయం ఉంటుంది. రాముడున్నాడంటే హనుమంతుడు కూడా ఉంటాడు. ఇక రామయ్య ఆలయం సంగతి పక్కనపెడితే చాలా గ్రామాల్లో, హైవేల పక్కన ఆంజనేయుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. హనుమాన్ ని తలుచుకుంటే చాలు ఎన్నో భయాలు తొలగిపోతాయని, శని బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. ఆంజనేయుడు అనే పేరు వింటేనే భక్తి పొంగి పొర్లుతుంది. అలాంటిది ఆ ఊర్లో ఆంజనేయుడు అనే పేరు వినిపించడాన్ని కూడా వారు ఒప్పుకోరట. పొరపాటున కూడా హనుమంతుడిని తలుచుకోరు. 


Also Read: ఆంజనేయుడు ఏడుకొండల్లోనే జన్మించాడు, ఆధారాలివిగో
హనుమంతుడిని వెలేసిన ఆ ఊరి పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలో ఉంది. ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ఈ ద్రోణగిరి. దీన్నీ దునగిరి, దూణగిరి అని కూడా అంటారు. ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం ఉంది. పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండ పై తపస్సు చేశాడని అందుకే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. దునగిరి దేవి శక్తిపీఠానికి మరో పేరు ‘ఉగ్ర పీఠ’.


Also Read: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..
ఈ ద్రోణగిరిలో ప్రజలు ఆంజనేయ స్వామి ని పూజించరు సరికదా.. ద్వేషిస్తారు. ఎవరైనా ‘హనుమంతుడు’ అని ఉచ్చరిస్తే చాలు విరుచుకు పడిపోతారు. మనల్ని కొట్టినంత పనిచేస్తారు. పొరపాటున ఎవరైనా హనుమంతుడ్ని ఆరాధించినట్టు తెలిస్తే, ఇక అంతే సంగతులు ఏకంగా ఊరినుంచే బహిష్కరిస్తారు. ఎందుకంటే..రామాయణ కాలంలో రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పు మేఘనాధుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. దీంతో సంజీవని కోసం వెతుకుతూ హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్ళాడు. ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి ప్రాంతానికి  చెందిన ఒక మహిళ సంజీవని ఉన్న పర్వతాన్ని ఆంజనేయస్వామికి చూపించిందని.. అయితే హనుమాన్ కు సంజీవని మొక్క ఏదో అర్ధం కాక మొత్తం పర్వతాన్ని ఆ గ్రామం నుంచి తనతో పాటు తీసుకెళ్లాడని చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు తమకు సంజీవనిని దూరం చేసిన హనుమంతుడు అంటే చాలా కోపం. అప్పటి నుంచి ఆంజనేయుడి పేరెత్తితేనే ఆ గ్రామ ప్రజలు మండిపడతారట. ఇంకా చెప్పాలంటే హనుమంతుడిని పూజించడం అక్కడ నేరంగా పరిగణిస్తారు.