ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. అందులో భాగంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆళ్వార్లు మొత్తం 12 మంది. ఆ పన్నెండు మందిలో కోయిల్ ఆళ్వార్ అనే వ్యక్తి లేడు. దేవాలయాన్నే ఆళ్వార్ గా వైష్ణవులు భావిస్తారు. అందుచేత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రాంతాన్ని అభిషేకించడం అని అర్థం. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి జరిపే సేవ ఇది. ఆ పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.
కోయిల్ ఆళ్వార్ సేవ సంవత్సరంలో నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది సమయంలో, ఆణివార ఆస్టానం సమయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవ జరుగుతుంది. సుగందద్రవ్యాదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత.
శ్రీవారి గర్భాలయానికి ఆనందనిలయం అని పేరు. అక్కడి నుంచి ఆలయ మహాద్వారం వరకు శుద్ది చేస్తారు. ఈసందర్భంగా స్వామివారిపై దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. లోపల అంతా శుద్ధి అయిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. వాటి చుట్టూ తెల్లటి వస్త్రాలతో తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తి చేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. ఇక గర్భాలయంలో మాత్రం కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు.
క్రీ.శ.1535 సమయంలో ప్రతి సంవత్సరం పది వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారు. ఆ సమయంలో ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు ఆలయశుద్ధి నిర్వహించేవారని తిరుమల శాసనాల ద్వారా తెలుస్తోంది. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే కేవలం ఆలయ శుద్ధి మాత్రమే కాదు అందులో మరింత లోతైన అర్థం దాగి ఉంది. తమిళంలో కోయిల్ అంటే గుడి. ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. ప్రతి ఒక్క భక్తుడికి మనసనే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడని. దాన్ని శుద్దిగా ఉంచుకోవాలనేది ఇందులో పరమార్థం.