Banana tree: హిందూ సంప్ర‌దాయం ప్రకారం ప్రతి రోజుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఎందుకంటే ఆయా రోజుల‌కు ఒక నిర్దిష్ట దేవతతో ముడిపడి ఉంటుంది. ఆ రోజు ఆ దేవ‌త‌ను పూజించ‌డం ద్వారా జీవితంలో శాంతి, సౌభాగ్యం ల‌భిస్తాయి.


ఆ విధంగా గురువారం శ్రీ మ‌హా విష్ణువుకు, బృహస్పతికి అంకితం చేశారు. ఈ రోజు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆరాధించిన తర్వాత అరటి చెట్టుకు పూజ చేసే ఆచారం ఉంది. హిందూ ఆచారాల ప్రకారం, బృహస్పతి అరటి చెట్టులో నివసిస్తాడ‌ని విశ్వ‌సిస్తారు.


ఈ రోజు అరటి చెట్టును పూజిస్తే, దేవతల గురువు, బృహస్పతితో పాటు శ్రీమహావిష్ణువు సంతోషిస్తారని  భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారని చెబుతారు. గురువారం నాడు బృహస్పతిని ఆరాధించడం వల్ల సంపద, జ్ఞానం, గౌరవం, కీర్తి ప్రతిష్టలతో పాటు అనేక ఇతర ఆశించిన ఫలితాలు లభిస్తాయని పురాణాల్లోనూ పేర్కొన్నారు. వివాహం ఆలస్యం అవుతున్న లేదా తగిన భర్త దొరకని యువ‌తులు గురువారం నాడు వ్రతాన్ని ఆచరించి అరటి చెట్టును పూజిస్తే వారికి అతి త్వరలో వివాహం జరగడమే కాకుండా ఉత్తమ జీవిత భాగస్వామి కూడా లభిస్తాడు.


అరటి చెట్టును ఎలా పూజించాలి


గురువారం తెల్లవారుజామున నిద్రలేచి శుచిగా స్నానం చేసిన‌ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. అనంత‌రం, ఈశాన్య స్థానంలో శ్రీ మ‌హా విష్ణువు ప్ర‌తిష్ఠించి పూజ నిర్వ‌హించి, అరటి చెట్టును పూజించాలి. పూజ చేసేటప్పుడు అరటిచెట్టుకు పసుపు, శనగపప్పు, బెల్లం, అక్షత, పూలు సమర్పించాలి.
ఇప్పుడు నేతితో దీపం వెలిగించి, హారతి ఇచ్చి, అరటిపండు నివేద‌న చేయాలి. గురువారం నాటి కథను చదివిన తర్వాత, అర‌టి చెట్టుకు ప్రదక్షిణలు చేసి, మీ కోరికలు తీర్చమని శ్రీ‌మ‌హా విష్ణువును ప్రార్థించాలి.
ఇంట్లో అరటి చెట్టు పెట్టి పూజ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇంటి బయట లేదా గుడిలో చెట్టు ఉంటే అక్కడ పూజలు చేయడం ద్వారా త్వ‌ర‌గా ఫ‌లితం ఉంటుంది.


గురువారం చేయ‌కూడ‌ని ప‌నులు


⦿ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలు గురువారం త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు. ఇలా చేయడం వల్ల జాతకంలో గురు స్థానం బలహీనపడుతుంది. దీనితో పాటు, వైవాహిక జీవితంపైనా చెడు ప్రభావం ప‌డుతుంది. ఆ దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు.


⦿ గురువారం నాడు క్షుర‌క‌ర్మ‌ చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంతానం విషయంలో అనేక రకాల సమస్యలు త‌లెత్తుతాయి.


⦿ గురువారం నాడు చేతులు, కాళ్ల‌ గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది, జాత‌కంలో గురు గ్రహం స్థానం బలహీనంగా మారుతుంది.


⦿ గురువారం నాడు దక్షిణం, తూర్పు, నైరుతి దిశ‌ల్లో పూజ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ రోజు దక్షిణం వైపు తిరిగి అస్స‌లు పూజ చేయ‌కూడ‌దు.


⦿ గురువారం రోజు అరటిపండ్లు తిన‌కూడ‌ద‌ని... బదులుగా, ఈ రోజు అరటి మొక్కను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలనే నియ‌మం ఉంది.


⦿ గురువారం రోజు బట్టలు ఉతకడం, ఇల్లు క‌డ‌గ‌డం స‌రికాద‌ని చెబుతారు. ఎందుకంటే ఇది జాతకంలో గురు స్థానంపై చెడు ప్రభావం చూపుతుంది. ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతుంది.


⦿ ఈ రోజు నీలం, నలుపు దుస్తులు ధరించడం మంచిది కాద‌ని పురాణాల్లో పేర్కొన్నారు.


Also Read : పంచతంత్రంతో విజయ రహస్యం


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.