Peepal Tree : హిందూ సంప్ర‌దాయంలో రావిచెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా శని ప్ర‌భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటుంటే రావిచెట్టును పూజించడం, దాని కింద దీపం వెలిగించడం ద్వారా శ‌నైశ్చ‌రుడు శాంతిస్తాడ‌ని విశ్వసిస్తారు.


ఏలినాటి శని, అర్ధాష్ట‌మ శ‌ని ప్ర‌భావం ఎదుర్కొంటున్న‌ప్పుడు ప్రజలు రావి చెట్టును పూజించడానికి కారణం ఇదే. రావి చెట్టును పూజించడం వెనుక చాలా మతపరమైన ప్రాముఖ్యం ఉంది, అది ఏమిటో తెలుసుకుందాం.                        


Also Read : ఇంట్లో రావి చెట్టు ఉండ‌కూడ‌దా - రావి చెట్టు నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది!


విష్ణువు ప్ర‌తిరూపం                        
హిందూ మత విశ్వాసాల ప్రకారం, రావి చెట్టు విష్ణువు మరొక రూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ వృక్షం అనే పేరు వచ్చింది. రావి చెట్టుకు నమస్కరించి, ప్రదక్షిణలు చేసిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొన్నారు.


స్వ‌ర్గానికి మార్గం                 
రావి చెట్టుకు నీరు పోసేవారికి, ఈ లోకంలో చేసిన పాపాలన్నీ నాశన‌మ‌వుతాయని లేదా తొల‌గిపోయి చివరికి ఆ వ్యక్తులు స్వర్గాన్ని పొందుతార‌ని కూడా ఒక నమ్మకం. రావి చెట్టు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మ‌హేశ్వ‌రుల నివాసంగా పురాణాల్లో వర్ణించారు.


త్రిమూర్తుల‌ నివాసం                    
శ్రీ‌మ‌హావిష్ణువు రావిచెట్టు మూలంలో నివసిస్తాడని, శంకరుడు చెట్టు కాండంలో ఉంటాడని, బ్రహ్మదేవుడు పైభాగంలో ఉంటాడని చెబుతారు. రావి చెట్టును నాటి కాపాడంతో పాటు, రావిచెట్టును స్పర్శించి, విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా భక్తులకు సంపద, స్వర్గం మరియు మోక్షం లభిస్తాయి.


తీర్థయాత్ర ఫ‌లితం               
రావిచెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు. అంతే కాకుండా, అన్ని తీర్థయాత్రలు రావిచెట్టులో ఉంటాయ‌ని చెబుతారు. అందుకే తీర్థయాత్రల‌కు వెళ్ల‌లేని వారు రావిచెట్టు కింద ఈ వ్రతం చేస్తారు. రావిచెట్టు కింద యాగం, పూజ, పురాణ కథ నిర్వహించడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ప్రజలు తమ ఇంటి ప్రవేశద్వారం వద్ద రావి ఆకులను ఉంచ‌డం శుభ‌ప్ర‌దంగా విశ్వ‌సిస్తారు.


Also Read : శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


శ‌ని స్థానం                       
హిందూ సంప్ర‌దాయం ప్రకారం శనిదేవుడు రావిచెట్టులో నివసిస్తాడ‌ని నమ్ముతారు. శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి దాని కింద దీపం వెలిగించిన వారికి ఏలినాటి శని, అర్ధాష్ట‌మ శ‌ని బాధలు ఉండ‌వు. అలాంటి వారికి శనిదేవుని ఆశీస్సులు ల‌భిస్తాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.