శ్రావణమాసం లాగానే కార్తీక మాసం కూడా మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం. హరిహరాదుల మాసం కార్తీకం. ఈ నెలరోజులు కూడా పూజలు, ఉపవాసాలతో ఇల్లు సందడిగా ఉంటుంది. శివ కేశవులకు బేధం లేదని చెప్పడమే ఈ మాస ప్రాముఖ్యత. అందుకే ఈ మాసం అంతా కూడా శివుడిని ఎంతగా ఆరాధిస్తారో విష్ణువుని కూడా అంతే ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.
“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”
....అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. దీపావళి తెల్లారి నుంచి నెల రోజుల పాటు నియమ నిష్టలతో కార్తీక వ్రతాన్ని నిర్వహిస్తారు చాలా మంది మగువలు.
ఇక ఈ కార్తీకమాసం మొత్తంలో అన్నీ రోజులు ప్రత్యేకమైనవే అయినా కార్తీక పూర్ణమి చాలా ప్రత్యేకం. కార్తీక పూర్ణమి రోజున దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆరోజు సాయంత్రం దీపకాంతుల శోభను వర్ణించలేం కూడా.. చంద్రుడి వెలుగులలో ఇంటి ముందర దీపకాంతులతో అద్బుతంగా ఉంటుంది. మరి ఆ కార్తీక పూర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందామా?!
పూర్వం వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించినది ఈ పౌర్ణమినాడే. అంతేకాదు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనరోజు కార్తీకపౌర్ణమి. శివుడు త్రిపురాసురులను సంహరించింది కూడా ఈ పౌర్ణమిరోజునే కావడంతో ప్రజలంతా పండుగ చేసుకున్నారు. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. అవేకాకుండా దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, తెలంగాణ పరిభాషలో జీటికంటి పున్నమి అని కుమార దర్శనమనే పేర్లతో కూడా పిలుస్తారు.
ఈ పౌర్ణమినాడు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు. ఇలా చేయడంవల్ల గయలోవారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది. తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి ఈరోజున వేలాదిమంది అక్కడికి తరలివెళ్తారు.
కార్తీక పౌర్ణమిరోజు రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలలో పాలుకాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని ఒక నమ్మకం. ఆ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారట. అందుకని పూర్వకాలంలో కార్తీకపౌర్ణిమ వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతోపాటు కాచి తాగేవారు. కార్తీక పౌర్ణమిరోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతోపాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈరోజున సాక్షాత్కరిస్తుందట. ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
తులా సంక్రమణం జరుగుతున్న ఈకార్తీకమాస సమయంలో శ్రీహరి ప్రతి నీటిబొట్టులో వ్యాప్తిచెంది ఉంటాడట. గోవుపాదం అంతటిజలంలో కూడా శ్రీహరి కొలువై ఉంటాడట. కాబట్టి కార్తీకమాసంలో నెలలో ఒకసారైనా నదీ స్నానం చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రత్యేకించి పౌర్ణమిరోజు ప్రాతఃకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేయడం విష్ణువుకెంతో ప్రీతికారకం. దానివల్ల శివ,కేశవులు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులువుతారు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!