Karthika Maha Puranam In Telugu Day 1 Story: స్కాంద పురాణంలో భాగమైన కార్తీక మాస మహత్మ్యం నుంచి ఉద్భవించింది కార్తీక పురాణం. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు చదువుతారు. మొదటిరోజు కథ పురాణం పరిచయంతో ప్రారంభమవుతుంది.
సూతుడు కార్తీక మహా పురాణం ఇలా చెప్పారు
పూర్వం నైమిశారణ్యానికి వచ్చిన సూతమహర్షిని సత్కరించిన శౌనకాది మునులు ...కైవల్యదాయకం అయిన కార్తీకమాస మహత్యాన్ని వినిపించి ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసమహర్షి శిష్యుడైన సూతముని ఇలా చెప్పారు.
శౌనకాదులారా! మా గురువుగారైన వేదవ్యాసులు ఈ కార్తీక మహత్యాన్ని.. అష్టాదశ పురాణాల్లో స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా చెప్పారు. కార్తీకమాసం ప్రారంభమైంది కావున ఈ నెలంతా కార్తీకపురాణం శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలో ఉన్న కార్తీక మహత్యాన్ని వివరిస్తాను వినండి అని చెప్పసాగారు..
పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యోగానికి అవసరమైన ద్రవ్యార్ది అయిన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా ఇస్తాను..అయితే సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని తెలియజేయండి అని అడిగారు జనకమహారాజు. అన్ని మాసాలకన్నా కార్తీకం అత్యంత మహిమాన్వితమైనది ఎలా అయింది? ఈ నెలకు ఎందుకంత ప్రాముఖ్యత కలిగింది? అని అడిగారు..అందుకు సమాధానంగా.. ఓ జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన వివరాలు చెబుతాను విను.. కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించాలి. ముందుగా..
సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే
ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అని నమస్కరించి సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం ఆచరించాలి. మొలలోతు నీటిలో నిల్చుని స్నానం ఆచరిస్తే మంచిది. అనంతరం దేవతలకు, రుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడవాలి. ఆ తర్వాత బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి వదిలి..తీరం చేరాలి. చేరగానే నీళ్లుకారుతున్న వస్త్రాలు పిండాలి..దీన్ని యక్షతర్పణం అంటారు. వళ్లు తుడుచుకిని తెల్లటి పొడి వస్త్రాలు ధరించి హరినామస్మరణ చేయాలి. శ్రీ మహావిష్ణువుకి షోడసోపచార పూజ పూర్తిచేయాలి. సాయంత్రం వరకూ ఉపవాసం ఆచరించి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో యథాశక్తి దీపాలు వెలిగించి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలి. కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారు. ప్రస్తుత జన్మలో పాపాలతో పాటూ పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా కార్తీక వ్రతం వల్ల హరించుకుపోతాయి.
జనకమహారాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా, ఇతరులు చేస్తుండగా చూసి..ఆనందించేవారికి కూడా మంచి జరుగుతుంది
కార్తీక పురాణం మొదటి అధ్యాయం సమాప్తం
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.