ఆ ఆలయంలో నిత్యం స్వామివారికి భోగం( నైవేద్యం) పెట్టేయగానే పూజారి కొండపై ఉన్న ఓ అరుగు దగ్గరకు వెళతాడు. అక్కడ పళ్లెంపై కొడుతూ ‘లే అంగ్, లే అంగ్’ అని అరుస్తాడు. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్టు... కొద్ది నిముషాల్లో పాతికకు పైగా నక్కలు బిలబిలమంటూ వచ్చేస్తాయి. పూజారి అక్కడుంచిన ప్రసాదాన్ని ఆవురావురుమని తినేసి వెళ్లిపోతాయి. నాలుగు శతాబ్దాలుగా అక్కడ ఇదే తంతు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలో దుంగార్ పర్వతంపై ఉన్న దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగే అద్భుతం ఇది.


Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
పర్వతం నల్లటి రంగులో ఉండడం వల్ల కాలో దుంగార్ అనే పేరు వచ్చింది. ఈ పర్వతం దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఈ పర్వతాన్ని ఎక్కితే దూరంగా ఉండే ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. చివరకు పాకిస్తాన్ భూభాగం కూడా కనపిస్తుందట. పైగా ఈ వింత కూడా ఉండడంతో పర్యాటకులు ఈ కొండ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తారు. 


కాలో దుంగార్ గురించి వినిపించే కథలు
త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయ స్వామివారు ఈ పర్వతాల మధ్య సంచరించినప్పుడు...ఆ సమయంలో ఆహారం కోసం కొన్ని నక్కలు ఆయన చుట్టూ చేరాయట. కానీ ఆ నక్కల ఆకలి తీర్చేందుకు దత్తాత్రేయులవారి దగ్గర ఎలాంటి ఆహారమూ లేదు. దాంతో తన చేతిని వాటిముందు ఉంచిన స్వామివారు ‘లే అంగ్’ (నా శరీరభాగాన్ని తీసుకో) అన్నారట. అప్పటి నుంచి స్వామివారు అక్కడ వెలిశారని నిత్యం ఆయనకు నైవేద్యం సమర్పించిన తర్వాత నక్కలకు పెట్టడం ఆనవాయితీగా వస్తోందంటారు.
 
మరొక కథ ప్రకారం 
దత్తాత్రేయుడి దర్శనం కోసం ఓ రాజు ఘోరమైన తపస్సు చేశాడట.  ఆ రాజు భక్తిని పరీక్షించేందుకు స్వామివారు నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకుని తన ఆకలి తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఇవ్వగా..  ‘ఇదేనా నీ దానగుణం. మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారం ఉంచుతావా!’అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో రాజు స్వయంగా తన చేతిని నరికి దత్తాత్రేయుల ముందు ఉంచాడట. రాజు దానగుణానికి ప్రశన్నులైన స్వామివారు నిజరూపంలో సాక్షాత్కరించారని చెబుతారు.


Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే


కథ ఏదైనా ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చిన ఘటన ఒకటి జరిగిందన్నది నిజం అంటారు స్థానికులు. దాని ఆధారంగా  400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారమూ సాగుతోంది. రోజూ మధ్యాహ్నమూ, సాయంత్రమూ దత్తాత్రేయుడికి నైవేద్యం పెట్టిన వెంటనే  ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి నక్కలకు పెడతారు. కాలో దుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. విచిత్రం ఏంటంటే క్రూరత్వానికి నిదర్శనమైన నక్కలు ఆలయం దగ్గరకు రాగానే సాధు జంతువులుగా మారిపోవడం. ఇదంతా దత్తాత్రేయ మహిమే అంటారు భక్తులు.