ఒక నిర్మాణం అందమైన ఇల్లుగా మారాలంటే మంచి ఎనర్జీతో ఉండాలి. అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందనేది వాస్తు శాస్త్ర వాదన. వాస్తు శాస్త్రం ప్రస్తావించిన పరిష్కారాలు ఈ ఎనర్జీని సంతులన పరచడంలో సహకరిస్తాయి. ఎన్నో గుళ్లు, గోపురాలు, కట్టడాలు వేలాది సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడానికి కారణం సరైన వాస్తు కలిగి ఉండడమే.
వాస్తు అంటే సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అర్థం. ఇది భారతీయ ఆర్కిటెక్చర్ విజ్ఞానం. వాస్తు వేదాల నుంచి సంగ్రహించిన శాస్త్రం. వేల సంవత్సరాలు భారతీయుల నమ్ముతున్న శాస్త్రం వాస్తు. వాస్తు ప్రస్తావన అథర్వణ వేదంలోని సత్పత్య వేదంలో ఉంది.
రామాయణం, మహాభారతాలలో సైతం వాస్తుశాస్త్రం గురించిన చర్చ ఉంది. వాస్తు శాస్త్రం ఇల్లు, ఆలయం, పట్టణం ఇలా సమస్త నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. చరిత్ర పుస్తకాలను పరిశీలిస్తే రెండు, మూడు వేల సంవత్సరాలకు పూర్వం మొహంజధారో, హరప్ప వంటి పురాతన పట్టణాలను వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి.
వాస్తు దోషం అంటే?
వాస్తు శాస్త్రంలో నిర్మాణానికి సంబంధించిన కొన్ని నియమాలను క్రోడీకరించారు. ఈ నియమాలను అనుసరించి నిర్మాణానికి ఉపయోగించే స్థలం లేదా నిర్మాణం లేనపుడు ‘‘వాస్తు ధోషం’’గా పరిగణిస్తారు. వాస్తు దోషం అంటే ఇన్ బాలెన్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ప్రతి ఇల్లు ఎనర్జీతో ఉంటుంది. ఇంటిలో గదుల నిర్మాణం, గదుల్లో వస్తువుల అమరిక ఆ ఎనర్జీని అనుసరించి లేకపోతే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. సరైన వాస్తు ఆయువు, ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దాంపత్య సౌఖ్యం, వృత్తి పరమైన అభివృద్ధి, జీవితంలోని ప్రతి అంశంలో ప్రభావం ఉంటుందని నమ్ముతాము. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నపుడు జీవితంలోని ప్రతి ఒక్క అంశం మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి.
కొన్ని రకాల వాస్తు దోషాలు వాటి ప్రభావాలు
⦿ వాస్తు ప్రకారం పూజ గది ఈశాన్య మూలన నిర్మించాలి. నైరుతిలో పూజ గది ఉంటే అది వాస్తు దోషం.
⦿ నైరుతి మూలన మాస్టర్ బెడ్ రూం ఉండాలి. వాయవ్యంలో ఉంటే వాస్తుదోషం.
⦿ నిర్మాణ స్థలం ఆకృతి సరిగ్గా లేకపోయినా అది దోషం కలిగిన స్థలంగా భావించాల్సి ఉంటుంది.
వాస్తు దోష ప్రభావాలు
⦿ కేవలం నిర్మాణంలోని ఒక పోర్షన్ ను మాత్రమే చూసి దోషాలను నిర్వచించడం సాధ్యం కాదు. అందరికీ ఒకే నియమం వర్తించకపోవచ్చు కూడా. వాస్తు నిపుణుల అభిప్రాయంలో అందరికీ ఒకే కరమైన వాస్తు నియమాలు ఒకే రకమైన ప్రభావాన్ని చూపించవు. ఇక్కడ కొన్ని సాధారణ వాస్తు దోషాలను గురించి తెలుసుకుందాం.
⦿ ఈశాన్య వాస్తు దోషం – కుటుంబ కలహాలు, వ్యాపార కలహాలు, పిల్లల ప్రవర్తన సరిగా లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఖర్చులు పెరగడం, చికిత్సలు లేని జబ్బులు, న్యాయపరమైన చిక్కులు, వ్యాపారంలో నష్టాలు
⦿ నైరుతి వాస్తు దోషం – ఇంట్లో పెళ్లీడు వారికి పెళ్లిళ్లు కుదరకపోవడం, ఖర్చులు పెరగడం, చెడు అలవాట్లు, దొంగతనాలు జరగడం, నష్టపోవడం, దంపతుల మధ్య కలహలు.
⦿ ఆగ్నేయ వాస్తు దోషం శత్రు పీడ, చట్టపరమైన చిక్కులు, ప్రభుత్వ పరమైన చిక్కులు, బంధు మిత్రులతో కలహాలు.
⦿ ఇవి మాత్రమే కాదు మెయిన్ ఎంట్రెన్స్ కి ఎదురుగా ఏదైనా అడ్డుగా ఉండడం, T జంక్షన్ కు ఎదురుగా ఇల్లు ఉండడం, బెడ్ రూమ్ కింద వంట గది ఉండడం, వంట చేసుకునే పొయ్యి, వాటర్ ట్యాంక్ ఒకే వరుసలో ఉండడం, మంచానికి ఎదురుగా అద్దం ఉండడం, మూడు తలుపులు ఒకే వరుసలో ఉండడం వంటివి కూడా పెద్ద వాస్తు దోషాలుగా పరిగణించవచ్చు.
వాస్తు దోషాలకు పరిష్కారాలు
⦿ వాస్తు నిర్మాణ శాస్త్రంగా జీవితంలో సుఖ సంతోషాలు నింపడం లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో పట్టణాలలో వాస్తును అనుసరించి అన్ని నిర్మాణాలు జరగడం లేదనేది కాదనలేని నిజం. ఇంటి బయటి వాస్తును మనం ఎలాగూ మార్చలేము. కానీ ఇంటిలోపలి నిర్మాణాలు ఇతర అంశాలు వాస్తును అనుసరించి ఏర్పాటు చేసుకుంటే కొంత వరకు నెగెటివ్ ఫలితాలను తప్పించుకోవచ్చు. ప్రతి వాస్తు దోషానికి ఒకటి కంటే ఎక్కువే పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం
⦿ గణేష పూజ, నవగ్రహ శాంతి, వాస్తు పురుష పూజ.
⦿ ప్రతి అమావాస్య, సోమవారాలలో రుద్ర పూజ జరిపించాలి.
⦿ వాస్తు పురుషుడి మూర్తి, వెండితో చేసిన నాగ ప్రతిమ, రాగి తీగ, ముత్యం, పగడం అన్నింటిని కలిపి ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ఇంటికి తూర్పు వైపున పెట్టాలి.
⦿ ప్రతిరోజు ఉదయం తూర్పు లేదా ఈశాన్య దిక్కుగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి.
⦿ ఇంట్లో ఏడుస్తున్న పిల్లలు, యుద్ధ సన్నివేశాలు, కోపంగా ఉన్న వ్యక్తులు, గుడ్లగూబ పటాలు లేదా చిత్ర పటాలు అవాంఛితమైనవిగా భావిస్తారు. అటువంటి వాటిని ఇంట్లో పెట్టుకోకూడదు. వాటి స్థానంలో వాస్తుకు అనువైన వాటిని పెట్టుకోవాలి.
⦿ వంటింట్లో గ్రైండర్, ఫ్రిజ్ వంటి బరువైన వస్తువులు పెట్టుకోవాలి.
⦿ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఖాళీగా ఉండే గోడ ఉంటే దాని మీద గణేష చిత్ర పటం లేదా శ్రీ యంత్రాన్ని ఉంచుకోవడం మంచిది.
ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జిని అందిస్తాయి. కాబట్టి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా లేదా వ్యాపారం ప్రారంభించదలచుకున్నా, లేక కొత్త ఇంటిని తీసుకోవాలనుకుంటున్నాలేదా చేరాలనుకుంటున్నా ఒక్క సారి వాస్తు నిపుణులను సంప్రదించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు.