దీపదానం అనేది ఎవరైనా, ఎప్పుడైనా చేయవచ్చు. అయితే విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని పొందగలం అని కార్తీక పురాణంలో పేర్కొన్నారు. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈమాసంలో దీపారాధన, దీపదానం లాంటి వాటికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది.
కార్తీక మాసం రాగానే మగువలంతా చేసేపని ఇంట్లో, తులసికోట దగ్గర, ఉసిరి చెట్టుకింద, గుళ్లలో దీపారాధన చేస్తుంటారు. రోజూ ఖచ్చితంగా సంధ్యా సమయంలో దీపారాధన చేస్తారు. అంతేకాదు ఈ మాసంలో దీపారాధనతో పాటూ దీపదానం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని కార్తీక పురాణంలో ఉంది.
మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది. ఈ నేను అహంకారం తొలగి భగవంతుడే సర్వజ్ఞుడు అనే భావన వస్తే వారి జీవితం వెలుగులమయం అవుతుంది. ఈ భావన కలగడానికే దీపదానం చేస్తారు. మనకు పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా పదహారు రకాల దానాల గురించిన ప్రస్తావన ఉంది. వాటిల్లో దీపదానం గురించి కూడా ప్రస్తావించారు.
ఇక దీపదానం ఎలా చేయాలంటే.. బియ్యంపిండిని గానీ, గోధుమపిండిని ఆవుపాలతో కలిపి దీపాన్ని చేసి, అందులో పూవ్వొత్తి వేసి, ఇవేవీ లేదంటే చివరకు రెండు మట్టి ప్రమిదలలో నూనె కానీ, నెయ్యి కానీ వేసి పూవ్వొత్తి వేసి, దానిని పసుపు, కుంకుమ, పుష్పాదులతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సాయం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది. స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు.
ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పూవొత్తి పెట్టి దానం చేస్తుంటారు. ఇది దీపదానం కాదు. ఒక పాత్రలో ఉసిరికాయలని తీసుకుని దాని పక్కన దీపాన్ని ఉంచి, బియ్యంతో, పప్పులాంటి ధాన్యం ఉంచి.. వాటితో సహా దానం చేయాలి. దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఇవ్వాలి. దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్ప పూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిది. విశేషించి పంచ మహా పర్వాలు అంటే కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం చాలామంచిది.
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం"
"దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ"
అనగా సర్వ జ్ఞాన స్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖములు కలిగించే ఈ దీపమును నేను దానం ఇస్తున్నాను. దీని వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక. అని శ్లోక భావం. పై శ్లోకాన్ని చెబుతూ దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులుగానీ, విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటూ, మోక్షప్రాప్తి లభిస్తుంది. దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియక గానీ చేసే పాపాలు తొలగిపోతాయి. దీని ప్రాశస్తాన్ని తెలిపే కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు. అయితే దీపదానం ఇవ్వడం వీలుకాకుండే స్వచ్చమైన నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ దానితో పాటూ వత్తులను దేవాలయంలో దీపారాధన చేయడానికి ఇచ్చినా దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం.